గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి
గీత కార్మిక జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల జనార్ధన్
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన గీత కార్మికుడు చీకటి శ్రీనివాస్ తాడిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి మూడు ఎముకలు విరగడంతో పాటు తలకు గాయమై పది కుట్లు పడ్డాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న శ్రీనివాస్‌ను కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల జనార్ధన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గీత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న ఈ పేద కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌కు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసి కుటుంబానికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షుడు మద్దెల నరసయ్య, కార్యదర్శి చిర్ర నరేష్, గొట్టిపర్తి సొసైటీ అధ్యక్షుడు బొమ్మగాని వెంకన్న, చీకటి మల్లయ్య, చామకూరి శ్రీను, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






