అక్రిడిటేషన్ కార్డులు,బస్ పాస్‌ల గడువు పొడిగింపు
- ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా
కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు ప్రభుత్వం తీపి కబురు అందించిందని,ప్రస్తుతం అమల్లో ఉన్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు,బస్ పాస్‌ల చెల్లుబాటు గడువును మరోసారి పొడిగిస్తూ సమాచార, పౌర సంబంధాల శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ నెల 31తో ముగియనున్న జర్నలిస్టుల బస్ పాస్‌ల గడువును జూన్ 16 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారిక లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కార్డుల గడువును కూడా జూన్ 16 వరకు పొడిగించిన నేపథ్యంలో, వాటి వ్యాలిడిటీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జర్నలిస్టులందరికీ ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది జర్నలిస్టులకు ఊరట లభించిందని, జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎండీ యాకూబ్ పాషా సూచించారు.






