calender_icon.png 22 February, 2026 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.!

22-02-2026 03:41:24 PM

- కుమ్మెర గట్టు వివాదంలో బీసీలపైన కేసు నమోదు

- బీసీలిచ్చిన ఫిర్యాదును మాత్రం ఆలస్యం చేస్తున్న పోలీసులు

- డీఎస్పీ ముందు ఎఫ్ఐఆర్ కాపీలను పరిశీలించిన తీన్మార్ మల్లన్న

- బీసీలపైనే కేసులు నమోదు చేయడంపై మండిపాటు

- మరోసారి ధర్నా

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కుమ్మెర గట్టు పంచాయతీ వివాదం మరింత ముదురుతోంది. కేవలం రెడ్డి నాయకులు ఇచ్చిన ఫిర్యాదును మాత్రమే ఎఫ్ఐఆర్ చేసి బాధితులు బీసీలు ఇచ్చిన ఫిర్యాదును కోర్టు అనుమతికి పంపుతూ పోలీసులు నిర్లక్ష్యం చేయడంతో మరింత వివాదం రాజుకుంది. ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా దాడి చేసిన రెడ్డి నిందితులఫై చర్యలకు పోలీసులు వెనకాడటాన్ని తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డిఎస్పీతో కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

బాధింపబడిన బీసీలు ఇచ్చిన ఫిర్యాదును కోర్టు అనుమతి కోరుతూ పంపామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కానీ దాడికి పాల్పడిన రెడ్డిలు ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా బీసీ దళిత కుటుంబంపై మాత్రం కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు పూనుకున్నారు. ఘటనా స్థలంలోనే బాధితులు 100 డైల్ చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు.

శనివారం సుమారు 5 గంటల పాటు దళిత సమాప్ పార్టీ వ్యవస్థాపకులు విశారద మహారాజ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు ఇచ్చిన హామీతో శాంతించినప్పటికీ పోలీసులు ఆ దిశగా బాధితులకు న్యాయం చేయకపోగా రెడ్డిలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేయడంపై వివాదం మరింత ముదురుతోంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇతర ప్రజాసంఘాల నేతలతో పాటు తీన్మార్ మల్లన్న డిఎస్పి చాంబర్లో కేసు వివరాలను పరిశీలించిన అనంతరం బీసీల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని గుర్తించామన్నారు.