వరి నుంచి ఆయిల్‌పామ్ వైపు రైతుల అడుగులు
చివ్వెంల: పంటల వైవిధ్యీకరణలో భాగంగా రైతులు అధిక నీటి వినియోగం ఉండే వరి సాగును తగ్గించి, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేయాలని మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు సూచించారు.
చివ్వెంల గ్రామానికి చెందిన రైతు నంద్యాల సోమిరెడ్డి గతంలో వరి సాగు చేసిన 10 ఎకరాల భూమిలో ఆయిల్‌పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పొలాన్ని పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ... భూగర్భ జలాలను పరిరక్షించడంతో పాటు రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం అందించేందుకు పంటల వైవిధ్యీకరణ అవసరమని అన్నారు.
రైతులు తమ భూమి, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయిల్‌పామ్, కంది, పెసర, మినుము వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని అనుకూలమైన భూముల్లో ఆయిల్‌పామ్ సాగును చేపట్టాలని కోరారు.






