మట్టిని వీడుతున్న రైతుబిడ్డలు!
వ్యవసాయంలో ప్రాథమిక మార్పులు రానంతవరకు, యువతను ‘మళ్లీ మట్టి వైపు మళ్లండి’ అని కోరే భావోద్వేగ పిలుపులు ఎప్పటికీ విజయవంతం కావు. వ్యవసాయం సాంకేతికంగా ఆధునికంగా, ఆర్థికంగా లాభదాయకంగా; సామాజికంగా గౌరవప్రదంగా మారినప్పుడు మాత్రమే మార్పు సాధ్యమవుతుంది.
వ్యవసాయం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. మన దేశంలో రాజకీయ వేదికలపై ‘జై కిసాన్’ అనే నినాదాలు నిత్యం మార్మోగుతూనే ఉంటా యి. కానీ, నేడు గ్రామీణ ముఖచిత్రంలో ఒక నిశ్శబ్ద విప్లవం లేదా నిశ్శబ్ద విషాదం చోటుచేసుకుంటున్నది. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్నది. భారతదేశ వ్యవసాయ సంక్షోభం అనేది వర్షాభావం, పంటల వైఫల్యం, అప్పుల భారం లేదా మార్కెట్ ధరల పతనానికి మాత్రమే పరిమితం కావడం లేదు.
అంతకంటే ప్రమాదకరమైన, సమాజ పునాదులను కదిలించే మార్పు ఒకటి నిశ్శబ్దంగా సాగుతున్నది. అదేమిటంటే, వ్యవసాయం సమాజంలో ఒక గౌరవప్రదమైన వృత్తిగా తన స్థానాన్ని క్రమంగా కోల్పోతున్నది. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతును సమాజం ఎంతో గౌరవంగా చూసేది. కానీ నేడు పరిస్థితులు తలకిందులయ్యాయి. గ్రామీణ యువత వ్యవసాయానికి పూర్తిగా దూరం కావడం ఈ సంక్షోభంలో అత్యంత ఆందోళనకరమైన అంశంగా మారింది.
గ్రామీణ భారతదేశంలో గతంలో వ్యవసాయం ఒక వృత్తి మాత్రమే కాదు, అదొక పవిత్రమైన జీవన విధానం. కానీ, గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నత జీవన ప్రమాణాల సాధనకు వ్యవసాయాన్ని వదిలిపెట్టడమే ఏకైక మార్గంగా మారిపోయింది. తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని, వ్యవసాయం నుంచి ఎలాగైనా బయటపడా లని గ్రామీణ తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం, ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకోవడం, గల్ఫ్ దేశాలకు నర్సింగ్ ఉద్యోగాల కోసం వలస వెళ్లడం లేదా బెంగళూరు,
హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగం సంపాదించడం విజయానికి కొలమానాలుగా మారాయి. ఎందుకంటే ఇవి వ్యవసాయంలో ఉం డే అనిశ్చితి నుంచి యువతకు పూర్తి ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో కష్టతరమైన వృత్తిగా భావించిన వ్యవసాయం, కాలక్రమేణా ఎవరూ ఇష్టపడని, సమాజం లో తక్కువగా చూసే వృత్తిగా మారిపోయింది. ఈ మార్పు సాంస్కృతికమైనది మాత్రమే కాదు, ఇది పూర్తిగా ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంది. నేటి కాలంలో వ్యవసాయం అనేది అసంఘటిత కార్మికుల అభద్రతతో కూడిన, వ్యవస్థాపక నష్టభయాల సమ్మేళనంగా రూపాంతరం చెందింది.
ధరల నిర్ణయాధికారం ఉండదు
వ్యవసాయ ఆదాయం అనేది పూర్తిగా రుతుపవనాలు, పెట్టుబడి వ్యయాలు, ప్రపంచ కమొడిటీ మార్కెట్ కదలికలు, రవాణా అంతరాయాలు, దళారుల ప్రవర్తనపై ఆధారపడి నడుస్తున్నది. అయినప్పటికీ, మార్కెట్లో ఉండే ఇతర వ్యాపారవేత్తలలా కాకుండా, రైతులకు పెట్టుబడి నిల్వలు, బీమా రక్షణ, తమ పంటకు తామే ధరలను నిర్ణయించే అధికారం ఉండవు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో తమ యువతను వ్యవసాయ రంగం నుంచి దూరం చేసి, వేతన ఉద్యోగాల వైపు ప్రోత్సహించడం గ్రామీణ కుటుంబాలకు పూర్తిగా హేతుబద్ధమైన విషయంగా అనిపిస్తున్నది. ఎవరైనా తమ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలనే కోరుకుంటారు తప్ప, నిత్యం నష్టాల్లో నడిచే రంగంలో ఉంచాలని అనుకోరు.
ఇది నిర్మాణపరమైన సంక్షోభం
అయితే, ఈ పరిణామాలు కేవలం వ్యక్తిగత కెరీర్ ఎంపికలకే పరిమితం కావు. భారతదేశం త్వరలోనే వ్యవసాయ వారసత్వంలో ఒక నిర్మాణపరమైన సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. దేశంలో సగటు భారతీయ రైతు వయస్సు క్రమంగా పెరుగుతున్నది. మరోవైపు గ్రామీణ యువత నగరాలు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు, సేవా రంగా లు, డిజిటల్ ఉద్యోగాల వైపు వేగంగా వలస వెళ్తున్నారు. చివరికి మన వ్యవసాయ విద్యావ్యవస్థ కూడా ఈ దారుణ వాస్తవాన్నే ప్రతిబింబిస్తోంది.
వ్యవసాయ పట్టభద్రులు అంతే
వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన చాలా మంది విద్యార్థులు భూమిని సాగు చేయడానికి ఇష్టపడటం లేదు. దానికి బదులుగా అగ్రి- బిజినెస్, ప్రభుత్వ సేవలు, ఫుడ్ టెక్నాలజీ లేదా కార్పొరేట్ సప్లయ్ చైన్లలో స్థిరపడాలని ఆకాంక్షిస్తున్నారు. వ్యవసాయాన్ని క్షేత్రస్థాయిలో ఆచరించకుండా, పుస్తకాల్లో చదవడమనే ధోరణి దేశంలో పెరుగుతోంది. ఈ ధోరణి భారతీయ విధానాలలోని వైరుధ్యాన్ని బట్టబయలు చేస్తోంది. ప్రభుత్వాలు రైతులను మాటలతో కొనియాడుతుండగా, గ్రామీ ణ ఆర్థిక వ్యవస్థ మాత్రం వ్యవసాయం సమాజంలో గౌరవాన్ని, భద్రతను కోల్పోతోందని సంకేతాలు ఇస్తోంది.
ఆశిస్తున్నది ఆదాయమే కాదు
రాజకీయ పక్షాలు ఎన్నికల సమయంలో రుణమాఫీలు, మద్దతు ధరల గురించిన చర్చలతో రాజకీయాలను శాసిస్తున్నాయి. కానీ, ఈ రెండూ వ్యవసాయం చుట్టూ ఉన్న లోతైన ఆకాంక్షల పతనాన్ని పరిష్కరించడం లేదు. యువ భారతీయులు అధిక ఆదాయాన్ని మాత్రమే ఆశించడం లేదు. వారు తమ జీవితంలో ఒక కచ్చితత్వాన్ని, ఎదుగుదలను, సామాజిక గుర్తింపును కోరుకుంటున్నారు. దీని దీర్ఘకాలిక ప్రభావాలు దేశ భవిష్యత్తుపై తీవ్రంగా ఉంటాయి. వ్యవసాయంలో తరాల వారసత్వాన్ని కోల్పోయే దేశం ఆహార భద్రత, గ్రామీణ సమాజ నిర్మాణాలు, పర్యావరణ పరిరక్షణను పణంగా పెడుతుంది. సాగు నుంచి పెద్ద ఎత్తున వలసలు జరగడం వల్ల భూముల కేంద్రీకరణ వేగవంతం కావచ్చు. కార్పొరేట్ ఆహార వ్యవస్థలపై ఆధారపడటం పెరగవచ్చు. సంపన్న పట్టణ ప్రాంతాలకు, వెనుకబడిన వ్యవసాయ జిల్లాలకు మధ్య ప్రాంతీయ అసమానతలు మరింత పెరగవచ్చు.
నమ్మదగిన భవిష్యత్తు ఎక్కడ?
అదే సమయంలో మన దేశంలో వ్యవసాయంలో ప్రాథమిక మార్పులు రానంతవరకు, యువతను ‘మళ్లీ మట్టి వైపు మళ్లండి’ అని కోరే భావోద్వేగ పిలుపులు ఎప్పటికీ విజయవంతం కావు. వ్యవసాయం సాంకేతికత విషయలో ఆధునికంగా, ఆర్థికపరమైన విషయంలో లాభదాయకంగా; ముఖ్యంగా సామాజికపరంగా చూస్తే సమాజంలో గౌరవప్రదంగా మారినప్పుడు మాత్రమే మార్పు సాధ్యమవుతుంది. అంటే నీటిపారుదల, పంట ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలు, లాజిస్టిక్స్, పంటల సాగులో వైవిధ్యం, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, స్థిరమైన మార్కెట్ సదుపాయాలలో భారీగా పెట్టుబడులు పెట్టాలి.
అలాగే రైతులను నిరంతరం ప్రభుత్వ సహాయంపై ఆధారపడేవారిగా కాకుండా, నైపుణ్యం కలిగిన ఆర్థిక శక్తులుగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశ గ్రామీణ యువత కృతజ్ఞత లేకపోవడం వల్ల వ్యవసాయాన్ని వదిలిపెట్టడం లేదు; ఆర్థిక వ్యవస్థ వారికి ప్రతిరోజూ పంపిస్తున్న ప్రతికూల సంకేతాల మూలంగా మాత్రమే వారు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిజమైన హెచ్చరిక ఏమిటంటే, యు వతకు వ్యవసాయం చేయడం ఇష్టం లేకపోవడం కాదు; రైతులే స్వయంగా వ్యవసాయాన్ని తమ పిల్లలకు వారసత్వంగా ఇవ్వదగిన భవిష్యత్తుగా నమ్మడం లేదు. ఈ పరిస్థితి మారనంత కాలం ’గ్రామీణ వలసలు’ ఆగవు. వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారమూ దొరకదు. ప్రభుత్వాలు, సమాజం కలిసి వ్యవసాయానికి ఆర్థిక భద్రతతో పాటు సామాజిక గౌరవాన్ని తిరిగి కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది.
వ్యాసకర్త: జర్నలిస్ట్, 9848559863






