5 June, 2026 | 12:45 AM

నిర్లక్ష్యపు ప్రమాదం!

05-06-2026 12:00 AM

ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాదం మరోసారి మన దేశంలో భద్ర తా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా, వారిలో 11 మంది విదేశీయులూ ఉండటం చర్చనీయాంశం. ఆప్ఘనిస్థాన్, సోమాలియా, నైజిరీయా, బంగ్లాదేశ్ లాంటి పేద దేశా లకు చెందిన వీరంతా అతితక్కువ ఖర్చుతో వైద్య చికిత్స లభిస్తుందనే ఆశతో భారత్‌కు వచ్చి, భద్రతా లోపాల కారణంగా విగతజీవులుగా మారడం విషాదకరం. ఇలాంటి ప్రమాదాలు ఒక్క దేశ రాజధానికే పరిమితం కావడం లేదు.

ఢిల్లీ ఘటనను మరువకముందే బీహార్‌లోని ఒక ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు మరణించడం దేశంలోని పరిస్థితికి అద్దం పడుతున్న ది. హైదరాబాద్‌లోనూ గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగి, అమాయకులు బలైపోయిన దాఖలాలున్నాయి. ప్రమాదం జరిగాక అధికారులు హడావుడిగా తనిఖీలు చేపట్టడం, నోటీసులు జారీచేయడం, ఆ తర్వాత కొంతకాలాని కి పరిస్థితి మళ్లీ మొదటికిరావడం మన దేశంలో సర్వసాధారణంగా మారిపోయింది.

ఢిల్లీ ఘటనలో నిబంధనలకు విరుద్ధంగా 25 గదులను నిర్వహిస్తు న్నారనే వార్తల నేపథ్యంలో సహజంగానే భవన యజమానుల నిర్లక్ష్యం గురించి ప్రస్తావనలు వస్తున్నాయి. అయితే, ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించేవారి నుంచి బాధ్యతను ఆశించడం అత్యాశే అవుతుంది.

నిబంధనలకు విరుద్ధంగా భవనాలకు అనుమతులిచ్చిన శాఖాధికారులు, గుర్తించని అధికారులను కూడా ఇక్కడ బాధ్యులను చేయాలి. మన దేశంలో భవన నిర్మాణం, భద్రతా ప్రమాణాలకు సంబంధించి చట్టాలకేం కొదవ లేదు. వాటి అమల్లో నిర్లక్ష్యం, అవినీతి వ్యవస్థాగతంగా పాతుకుపోవడమే సమస్యగా మారింది. ప్రమాదాలు జరిగాక కమిటీలు వేయడం, పరిహారం ప్రకటించడంతోనే సరిపెడుతున్న పాలకులు, అధికారులు వ్యవస్థలోని లోపాలను రూపుమాపకపోవడం శాపంగా పరిణమించింది.

ఇలాంటి ప్రమాదాలను అరికట్టాలం టే ముందస్తు నివారణ చర్యలతోపాటు  నిబంధనలు ఉల్లంఘించిన భవన యజమానులు; నిర్లక్ష్యం వహించిన, అవినీతికి పాల్పడిన అధికారులకు కఠిన శిక్షలు విధించడం అవసరం. అగ్నిప్రమాదాలు కేవలం ప్రమాదవశాత్తు జరిగే ఘటనలు కావు. అనేక సందర్భాల్లో నిర్లక్ష్యం, అవినీతి, బాధ్యతారాహిత్యానికి ఫలితంగా ఇవి సంభవిస్తుంటాయి. అమాయకుల ప్రాణాలు పోయిన తర్వాత సంతాపం ప్రకటించడం, పరిహారం ఇవ్వడం కంటే ప్రమాదం జరగకముందే నివారించడం అత్యావశ్యకం. లేకపోతే మన దేశంలో ఇలాంటి విషాదాలు పునరావృతమవుతూనే ఉంటాయని చెప్పక తప్పదు.