ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి
పెద్దపల్లి,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లాలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సమీకృత ఉద్యానాభివృద్ధి మిషన్ (MIDH) పథకం కింద కూరగాయలు, పూల పంటలు, పసుపు సాగు, మల్చింగ్ షీట్లకు సబ్సిడీ అందజేయబడుతోంది. అలాగే సూక్ష్మ నీటిపారుదల పథకం మైక్రో ఇరిగేషన్ స్కీం ద్వారా డ్రిప్, స్ప్రింక్లర్ నీటిపారుదల వ్యవస్థల ఏర్పాటుకు కూడా సబ్సిడీ కల్పిస్తున్నట్లు జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాల ప్రయోజనాలను పొందాలని ఆయన కోరారు.
అర్హులైన రైతులు తమ గ్రామ పరిధిలోని సంబంధిత హార్టికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ హెచ్ ఈఓ లేదా హార్టికల్చర్ ఆఫీసర్ హెచ్ ఓను సంప్రదించి క్రింది పత్రాల జిరాక్స్ ప్రతులతో దరఖాస్తు సమర్పించాలని, పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, రైతులు ఈ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకొని ఉద్యాన పంటల సాగును విస్తరించి అధిక ఆదాయం పొందాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.






