15 March, 2026 | 9:24 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు..

17-03-2025 05:44 PM

చెరుకు శ్రీనివాస్ రెడ్డి హామీతో ఆందోళన విరమణ...

దౌల్తాబాద్, చేగుంట (విజయక్రాంతి): తలాపున గోదావరి నీళ్లు వస్తున్నప్పటికీ తమ పంటలకు సాగునీరు రాకపోవడంతో చేతికి వచ్చిన పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన రైతులు గజ్వేల్-చేగుంట రహదారిపై ఇందుప్రియాల్ చౌరస్తా లోని రామాయంపేట కెనాల్ వద్ద టెంట్ వేసుకొని రహదారిపై కట్టెలు, ముళ్లపొదలను అడ్డంగా పెట్టి ధర్నా నిర్వహించారు. కిలోమీటర్ల పొడవున వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

దౌల్తాబాద్ మండలం మాచినపల్లి, మెదక్ జిల్లా చేగుంట మండలం కసాన్ పల్లి, పోతాన్ పల్లి, చందాయిపేట, గోసన్ పల్లి, చిన్న శివనూర్, పెద్ద శివనూర్ తదితర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు మధ్యాహ్నం వరకు రోడ్డుపై బైఠాయించి పంట పొలాలకు నీరందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న తోగుటసిఐ లతీఫ్, దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ లు ధర్నా వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు. తమ గ్రామాలకు కాలువ ద్వారా నీరు అందించే వరకు బైఠాఇస్తామని తెలుపగా మీ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని రైతులకు సీఐ హామీ ఇచ్చారు.

రైతుల సమస్యలను పరిష్కరిస్తా..

రామాయంపేట కెనాల్ ద్వారా నీరు అందించి రైతుల సమస్యను పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్లి వచ్చే సంవత్సరం జనవరి కల్లా గ్రామాలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి హామీ ఇవ్వగా రైతులు ధర్నాను విరమించారు. అనంతరం రైతులతో కలిసి రామాయంపేట కెనాల్ కాలువను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.