28 May, 2026 | 3:50 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

28-05-2026 02:08 AM

పాలకుర్తి లో పచ్చి రొట్టె విత్తనాల పంపిణీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

పెద్దపల్లి, మే 27(విజయ క్రాంతి) రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు.గురువారం పాలకుర్తి మండలంలో నిర్వహించిన రైతులకు రాయితీపై పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని రైతులకు విత్తన సంచులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతుల ఆదాయం పెరగడం, భూమి సారవంతం కావడం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం రైతు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.

పొగ లేని పొలం, రోగం లేని గ్రామం అనే నినాదంతో పొలాల్లో పంట అవశేషాలు, గడ్డి, కొయ్య కాల్చకుండా రైతులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గడ్డి తగలబెట్టడం వల్ల గాలి కాలుష్యం పెరగడంతో పాటు నేల సారం తగ్గే ప్రమాదం ఉంటుందని వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వానాకాలం ముందు రైతులకు 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్టె విత్తనాలు, జీలుగ, జనుము విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇవి భూమి సారాన్ని పెంచి పంట దిగుబడులకు తోడ్పడతాయని పేర్కొన్నారు.

రైతులకు రుణమాఫీ, వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీ, సబ్సిడీపై విత్తనాల పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించే పోస్టర్ను ఆవిష్కరించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొయ్యలకు నిప్పు పెట్టవద్దని, పర్యావరణాన్ని కాపాడుతూ వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రామగుండం ఏఎంసీ చైర్మన్, కన్నాల సింగిల్ విండో చైర్మన్, వ్యవసాయ అధికారులు, ఎంపీడీవో, ఎస్హెచ్‌ఓ, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.