5 September, 2026 | 5:51 AM

చేతికందకుండా పోతున్న తెల్ల బంగారం?

05-09-2026 | 04:35am

వర్షం పడుతున్నా పత్తి మాత్రం పెరగడం లేదు

మూడు నెలలు గడిచినా మందగించిన పంట 

దిగుబడిపై రైతుల్లో ఆందోళన

కంగ్టి, సెప్టెంబర్ 4: వర్షాలు కురుస్తున్నా పత్తి పంట(Cotton Crop) ఆశించిన స్థాయిలో ఎదగకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. విత్తనం వేసి మూడు నెలలు గడుస్తున్నా మొక్కలు ఆశించిన మేరకు పెరగకపోవడంతో ఈసారి దిగుబడి ఎలా ఉంటుందోనని రైతులు కలవరపడుతున్నారు. వర్షం పడుతోంది.. పత్తి మాత్రం పెరగడం లేదు. అసలు ఏం జరుగుతోందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంగ్టి మండల వ్యాప్తంగా ఈ ఏడాది 32,356 ఎకరాల్లో పత్తి సాగు చేపట్టారు. వేలాది రైతు కుటుంబాల భవిష్యత్తు ఈ పంటపైనే ఆధారపడి ఉంది.

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల కోసం రైతులు ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టారు. కొందరు సొంత డబ్బుతో సాగు చేయగా, మరికొందరు అప్పులు చేసి పంట వేశారు. వర్షాలు ఉన్నా ఎదుగుదల అంతంతే మాత్రంగానే ఉంది. ఈఏడాది అడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ పత్తి మొక్కలు ఆశించిన స్థాయిలో ఎదగడం లేదని రైతులు చెబుతున్నారు.

సాధారణంగా ఈ సమయానికి పత్తి మొక్కలు ఏపుగా పెరిగి పూత, కాయ దశకు చేరాల్సి ఉండగా మండలంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు చిన్నగానే కనిపిస్తున్నాయి. దీంతో దిగుబడిపై రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. పత్తి పంట ఎదుగుదల మందగించడానికి గల కారణాలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, పంట సంరక్షణ చర్యలు అందించాలని రైతులు కోరుతున్నారు. 

మూడు నెలలుగా ఎదురుచూస్తున్నాం

మూడు నెలలుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయినా పత్తి పంట ఆశించిన స్థాయిలో ఎదగడం లేదు. పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగాయి. ఈసారి దిగుబడి ఎలా వస్తుందో అర్థం కావడం లేదు. పంటకు పెట్టిన పెట్టుబడి, చేసిన అప్పులు ఎలా తీర్చాలో ఆందోళనగా ఉంది. పంట బాగా పండితేనే అప్పులు తీర్చగలుగుతాం.

-రైతు హన్మగొండ, చాప్టా (కే)

దిగుబడి వస్తేనే అప్పులు తీరుతాయి

పత్తి సాగు కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేశాను. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు కలిపి పెట్టుబడి పెరిగిపోయింది. ప్రస్తుతం పంట పరిస్థితిని చూస్తుంటే ఆందోళనగా ఉంది. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో వస్తేనే పెట్టిన పెట్టుబడితో పాటు చేసిన అప్పులు తీర్చగలుగుతాను. పత్తి పంట చేతికొచ్చే వరకు భయంగానే ఉంది. ప్రభుత్వం రైతులకు అవసరమైన సహాయం అందించాలని కోరుతున్నాను.

-రైతు శంకరప్ప, మూర్కుంజల్

ఖర్చులు బాగా పెరిగాయి

వర్షాలు కురుస్తున్నప్పటికీ పత్తి పంట ఎదుగుదల ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగాయి. ముఖ్యంగా కలుపు తీసేందుకు కూలీల కొరత ఏర్పడడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు. ఒక్కో కూలీకి రోజుకు రూ.500కు పైగా చెల్లించాల్సి వస్తోంది. తప్పనిసరిగా కలుపు తీయించాలి. పంట బాగా పండితేనే కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు చేసిన అప్పులు తీర్చగలుగుతాం.

-రైతు పండరీనాథ్ రావు, తడ్కల్

పరిశీలిస్తున్నాం...

కంగ్టి మండలంలోని ప్రతి గ్రామంలో పత్తి పంటల పెరుగుదలను తప్పని సరిగా పరిశీలిస్తున్నాం. పంటలో లేదా మొక్కల్లో ఏదైనా సమస్య గుర్తించినట్లయితే వెంటనే వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. సమస్యకు సంబంధించిన వివరాలను రైతులకు తెలియజేసి, పంట సంరక్షణకు అవసరమైన సూచనలు అందిస్తాం.

హరిస్ పవర్, 

మండల వ్యవసాయ అధికారి 

మరిన్ని వార్తలు