28 July, 2026 | 9:23 PM

ఉన్నంతలో వ్యవ‘సాయం’!

30-05-2024 12:47 AM

మేడ్చల్, మే 29 (విజయక్రాంతి): మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా రోజురోజుకు నగరంగా రూపుదిద్దుకున్పటికీ కొంతమేర వ్యవసాయం కొనసాగుతోంది. జిల్లా పరిధిలో 35వేల ఎకరాల్లో వానకాలంలో సాగుచేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ జిల్లా అధికారి మేరీ రేఖ వెల్లడించారు. 4,450 వేల  ఎకరాల్లో పండ్ల తోటలు ఉన్నట్లు చెప్పారు. 18 వేల ఎకరాల్లో వరి, 2 వేల ఎకరాల్లో కూరగాయ లు సాగు చేసే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా పశు వుల మేత కోసం గడ్డిజాతి పంటలు 2,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 5 ఎకరాల్లో వివిధ రకాల పూల తోటలు ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో  48,721 మంది రైతులుండగా ఇప్పుడు కేవలం 15 వేలకు తగ్గింది. అందులోనూ ఎక్కువ శాతం కౌలుదారులే ఉన్నట్లు పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా వ్యవసాయ దారులకు ప్రభుత్వం కొన్ని పంటలకు సబ్సిడీ ఇస్తుంది.  ఈయేడాది పచ్చిరొట్టె, జనుముకు 60 శాతం సబ్సిడీతో ఇవ్వనున్నట్లు వ్యవసాయాధికారులు తెలి పారు. పచ్చిరొట్టె విత్తనాలు జిల్లాలో 347 క్వింటాళ్లు అవసరము.ఒక క్వింటాకు రూ.9050వేలుండగా రైతులు కేవలం రూ.3620 చెల్లిస్తే రూ.5430 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇక జనుముకు రూ.9300 వేలుండగా రైతులు 3720 చెల్లిస్తే రూ. 5580 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుందని మేరీ రేఖ తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై ఇప్పటికే దృష్టి సారించామని, ఒకవేళ ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు జాగ్రత్తగా పరిశీలించాకే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని హితవుపలికారు.