రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా, లేనట్టా?
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ప్రశ్న
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి) : రాష్ట్రంలో విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆరోపించారు. ఆసలు ప్రభుత్వం ఉన్నట్టా, లేనట్టా అని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో తిర గడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో గణాంకాలు లేవా అంటూ ప్రశ్నించారు. మొన్నటివరకు ధాన్యం అమ్ముకుందా మంటే కొనేవాళ్లు లేరు, నేడు విత్తనాలు కొనుగోలు చేద్దామంటే అమ్మేవాళ్లు లేరని ఎద్దేవా చేశారు.
పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇవే నిదర్శమన్నారు. సాగునీరు ఇవ్వడం చేతకాక పంటలు ఎండబెట్టా రని, ఇప్పుడు విత్తనాలు సరఫరా చేసే కాలం లో పాలకులకు ముందుచూపు లేకుండా పోయిందన్నారు. తెల్లజామున 4 గంటలకు రైతులు క్యూలైన్‌లో నిలబడితే సాయంత్రం 4 గంటల వరకు విత్తనాలు ఇవ్వలేరా, దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిన తెలంగాణలో అన్నదాతలకే తిండి తిప్పలు లేకుండా చేస్తారా అని మండిపడ్డారు.
గత బీఆర్‌ఎస్ పాలనలో వ్యవసాయం పండగలా సాగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రం ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరిపడ విత్తనాలు సరఫరా చేసి, విత్తనాలు బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలం కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదని హెచ్చరించారు.






