గొర్రెల కాపరుల కుటుంబంలో విషాదం..
బొక్కల వాగులో పడి ఆర్‌కే రాజు మృతి.. మంథని బోయిన్‌పేటలో విషాదఛాయలు
మంథని, ఆగస్ట్ 12(విజయక్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలోని బోయిన్‌పేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పర్శవేణ రాజు (ఆర్‌కే రాజు) తన కూతురిని ప్రమాదం నుంచి కాపాడే ప్రయత్నంలో బొక్కల వాగులో పడి మృతి చెందారు. వర్షాల కారణంగా బొక్కల వాగులో నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. కూతురి ప్రాణాలను కాపాడేందుకు తండ్రి ఆర్‌కే రాజు చేసిన ప్రయత్నం విషాదాంతంగా మారింది. కూతురిని కాపాడి తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి మృతితో బోయిన్‌పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కూతురి కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆర్‌కే రాజు చేసిన త్యాగం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.






