12 August, 2026 | 3:48 PM

ప్రయాణ ప్రాంగణాన్ని సందర్శించిన ఆర్టీసీ డిపో మేనేజర్

12-08-2026 02:23 PM

మల్లాపూర్, ఆగస్టు 12(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ (ప్రయాణ ప్రాంగణాన్ని) మెట్పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ డి.హరి బుధవారం సందర్శించారు. మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ గత ఎనిమిది నెలలుగా ఆహ్వానిస్తున్న నేపథ్యంలో డిపో మేనేజర్ బస్టాండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ప్రయాణ ప్రాంగణంలోని గుంతలను ఇప్పటికే పూడ్చివేయించామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్ల సమస్యలను పరిష్కరించాలని డిపో మేనేజర్‌ను కోరారు. అలాగే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా ఒక బస్సు ట్రిప్‌ను నడిపించాలని విజ్ఞప్తి చేశారు.ప్రయాణికుల సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని డిపో మేనేజర్ డి.హరి సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో టి.ఐ. త్రీ నాగన్న, వార్డు సభ్యుడు మహమ్మద్ షబ్బీర్, నాయకులు ఎదులపురం శంకర్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.