15 July, 2026 | 12:32 AM

ఫీజు బకాయిలు విడుదల చేయాలి

15-07-2026 12:32 AM
  1. ప్రజాపాల అంటూనే నిర్బంధాలా?
  2. సచివాలయ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం
  3. అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు మంగళవారం చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు నిర్బంధాలు చేపట్టడంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ క్రమంలో విద్యార్థి నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు పలువురు విద్యార్థి నాయకులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ వాహనాల్లో తరలించారు. ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. 

ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, అశోక్‌రెడ్డి, ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోనగిరి మధుకర్, ఏఐపీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆడెపు రవికుమార్ తదితరులు మాట్లాడారు.

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ర్టంలో లక్షలాది మంది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందక ఇబ్బందులు పడుతున్నారని, చదువులకు దూరమవుతున్నారని వాపోయారు. కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.  

రూ.11 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాల్సిందే

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఉద్యమాలను అణచివేయడం సరికాదని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, వెంటనే రూ.11 వేల కోట్ల పెండింగ్ బకాయిలను ఏకకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.  

అరెస్టులకు పాల్పడటం దుర్మార్గం

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు చలో సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిస్తే  పోలీసులు నిర్బంధానికి పాల్పడటాన్ని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు రజినీకాంత్, నాగరాజు ఖండించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాపాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ, ముందస్తు అరెస్టులు ఉండవు, ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు వింటాం అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం..

అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు, యువత, ప్రజా సంఘాలపై నిర్బంధ పాలనను అమలు చేయడం దారుణమన్నారు. ఒకవైపు వివిధ పథకాల పేరుతో ప్రకటనలు చేస్తూ, మరోవైపు మంత్రు లు, అధికారుల ఖర్చుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు బకాయిలు మాత్రం విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు.

విద్యపై ఖర్చు చేయాల్సిన నిధులను నిర్లక్ష్యం చేయడమనేది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు వంశీ వర్ధన్‌రెడ్డి, అన్వర్, చైతన్య యాదవ్, మురళి కృష్ణ, శరత్, పార్థసారథి, శేఖర్, నరేష్, శాంతి కుమార్, అనిల్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు లెనిన్ గువేరా, శంకర్, పవన్, నాగరాజు, శ్రీకాంత్, రాణాప్రతాప్, బి.శ్రీకాంత్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.