పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం
కొత్తగూడెం,(విజయక్రాంతి): పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ, ప్రజలకు విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులను, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్, శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా 37 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో సేవలందించిన ఏఎస్ఐ గంట ప్రసాద్ రావు, అలాగే 36 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించిన, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఓంకారం శ్రీముఖ రాజు పదవీ విరమణ పొందారు.
జిల్లా ఎస్పీ శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులు తమ పోలీసు సేవా అనుభవాలను పంచుకున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. వ్యాయామం, యోగా, ధ్యానం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగించాలని సూచించారు.
పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వం నుంచి రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు సకాలంలో, అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య నాయక్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్బి ll ఇన్స్పెక్టర్ ఇ శ్రీనివాస్, ఆర్ఐ కృష్ణారావు, పోలీసు అధికారుల సంఘం సభ్యులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






