31 July, 2026 | 5:57 PM

విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలకు వెనుకాడను

31-07-2026 05:04 PM

* అధికారులు,  సర్పంచులు ప్రజలకు జవాబుదారిగా పనిచేయాలి

*  అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ హెచ్చరిక

అచ్చంపేట: ప్రజలకు జవాబుదారిగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శుక్రవారం అచ్చంపేట మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణపై సర్పంచులు శ్రద్ధ వహించాలన్నారు.

* నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు

ప్రజల సమస్యల పరిష్కారంలో సర్పంచులదే ప్రాథమిక బాధ్యత అన్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడితే శాఖాపరమైన విచారణ జరిపి సర్పంచుల పదవులను రద్దు చేయడంతోపాటు, పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఉంటే షోకాజ్‌ నోటీసులు ఇచ్చి సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. గ్రామసభలు నిర్వహించి ప్రజామోదంతో శాశ్వత ప్రయోజనం కలిగే పనులను చేపట్టాలని సూచించారు. వరుసగా సమావేశాలకు గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవన్నారు.

* ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక దృష్టి

మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఇళ్లు మంజూరై నిర్మాణాలు ప్రారంభించని వారికి మూడుసార్లు నోటీసులు ఇచ్చి.. అయినా పనులు ప్రారంభించకపోతే జాబితా నుంచి తొలగించాలని సూచించారు.

* ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం

విద్యాశాఖపై సమీక్షించిన ఎమ్మెల్యే.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉపాధ్యాయులందరూ విధులకు హాజరయ్యేలా చూడాలని, డిప్యూటేషన్లు రద్దు చేయాలని ఎంఈవో శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబలోపేతానికి ప్రభుత్వం అల్పాహారం, యూనిఫాం తదితర సౌకర్యాలు కల్పిస్తోందన్నారు.

* సిద్దాపూర్‌ పీహెచ్‌సీపై ఆగ్రహం

మారుమూల ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందించడంలో సిద్దాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. మెడికల్‌ ఆఫీసర్‌ గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సిబ్బంది బాధ్యతారాహిత్యంపై కలెక్టర్‌కు చర్యల కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్యాధికారికి ఫోన్‌ ద్వారా పరిస్థితిని వివరించి తగిన ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ చిన్న ఓబులేసు, ఆర్డీవో యాదగిరి, పంచాయతీరాజ్‌ డీఏ చంద్రకళ, డీఎల్‌పీవో వెంకట ప్రసాద్‌, తహసీల్దార్‌ సైదులు, ఎంపీడీవో అరుంధర్‌రావు, వాటర్‌గ్రిడ్‌ డీఈ సుదర్శన్, ఏవో కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.