31 July, 2026 | 6:02 PM

మారు మూల ప్రజలకు మెరుగైన వైద్యం ప్రభుత్వ లక్ష్యం

31-07-2026 05:23 PM

మహదేవపూర్ ఆసుపత్రి పునర్నిర్మాణం  

ఆరోగ్య శిబిరాలతో సేవల విస్తరణ

గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యం కోసం ప్రత్యేక చర్యలు

ఆగస్టు 4 న భారీ ఉచిత ఆరోగ్య శిబిరం

కాటారం డివిజన్‌లో వేల మందికి చికిత్సలు

రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

భూపాలపల్లి/ మహదేవపూర్,(విజయక్రాంతి): మారు మూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శిధిలావస్థలో ఉన్న మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు.

శుక్రవారం మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో ఐడిబిఐ సహకారంతో ఎంఎన్‌జే ఆసుపత్రి హైదరాబాద్, ఓమెగా ఆసుపత్రి కరీంనగర్ వైద్య బృందాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్, కంటి పరీక్షల శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ముఖ్యంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

పేద ప్రజలు ఆర్థికంగా నష్టపోకుండా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించేందుకు ఇలాంటి శిబిరాలు ఉపయోగపడతాయని అన్నారు. హెల్త్ ఏటిఎం ద్వారా 64 రకాల వైద్య పరీక్షలను వేగంగా నిర్వహించే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పరీక్షల వివరాలు కార్డు రూపంలో అందించి ఐదేళ్ల వరకు భద్రపరచే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

కంటి పరీక్షల కోసం ప్రత్యేక పరికరాలు,గుండె సంబంధిత సమస్యల గుర్తింపుకు ఈసీజీ యంత్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధులను ప్రారంభ దశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స పొందవచ్చని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం, విద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం ఆగస్టు 4న ఎంఎన్‌జే ఆసుపత్రి ఆధ్వర్యంలో మరో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇప్పటివరకు కాటారం డివిజన్ పరిధిలో 680 మందికి హైదరాబాద్‌లో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించినట్లు, మంథని నియోజకవర్గంలో సుమారు 45 వేల మందికి కంటి చికిత్సలు అందించినట్లు మంత్రి వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.