ఆదిలాబాద్‌లో 52 అడుగుల గణనాథుడు

14-09-2026 | 05:15am
  1. ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం
  2. చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలిరానున్న భక్తులు

ఆదిలాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆదిలాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగే వినాయక ఉత్సవాలు (Ganesha Festival) ప్రత్యేకత చాటుకుంటాయి. ఖైరతాబాద్‌లో ఎత్తున భారీ వినాయకుని మాదిరిగానే ఆదిలాబాద్‌లో సైతం గత కొన్నేళ్లుగా ఎత్తయిన గణనాథున్ని ప్రతిష్టించ డం ఆనవాయితీ.

జిల్లా కేంద్రంలోని కుమార్ పేట్ కాలనీలో నూతి (బావి)పైనే కుమార్ జనతా గణేష్ మండల్ (Kumar Janatha Ganesh Mandal)పేరుతో నిర్వాహకులు తోట పరమేశ్వర్ ఆధ్వర్యంలో 52 ఏళ్లుగా గణనాథున్ని ప్రతిష్టిస్తున్నారు. ఈ ఏడాది 52 ఏళ్ల సందర్భంగా మట్టితో చేసిన 52 అడుగుల ఎత్తున గణనాథున్ని ప్రతిష్టిస్తున్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ కళాకారుడు ఊరే గణేష్ చేతిలో ఈ భారీ గణనా థుడు రూపుదిద్దుకుంటున్నాడు.

గత కొన్నేళ్లుగా మట్టితో ఏకదంతుని విగ్రహాన్ని తయారు చేస్తున్న కళాకారుడు ఊరే గణేష్ ఈ సంవత్సరం 22 రోజుల్లోనే ఈ ఎత్తున వినాయకున్ని తయారు చేశాడు. ఈ వినాయకున్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేయడం ఆనవాయితీ. నూతిపైనే ఈ భారీ వినాయకున్ని ప్రతిష్ఠించడంతో నిమజ్జనం రోజున నీటిపైప్‌ల ద్వారా న్రిమజ్జనం క్రతువును పూర్తి చేస్తారు. వినాయకుని దర్శనానికి, నిమజ్జన క్రతువును వీక్షించేందుకు జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు.

మరిన్ని వార్తలు