3 May, 2026 | 2:23 AM

కోలీవుడ్‌లో షూటింగ్స్ బంద్

03-05-2026 12:00 AM

తమిళ చిత్ర పరిశ్రమలో షూటింగ్స్ బంద్ అయ్యాయి. నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం కారణంగా తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (టీఎఫ్‌పీసీ) శనివారం షూటింగ్స్ బంద్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న ‘ఫిక్స్ రెమ్యునరేషన్’ పద్ధతి వల్ల నిర్మాతలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని.. అందుకే మీడియం, బిగ్ బడ్జెట్ సినిమాల్లో ‘రెవెన్యూ షేరింగ్‘ మోడల్‌ను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నటులు, దర్శకులు భారీ పారితోషికాలు తీసుకోవడం వల్ల సినిమా పరాజయం పాలైనప్పుడు నిర్మాత నిండా మునిగిపోతున్నాడని, ఈ వ్యవస్థను మార్చి అందరూ రిస్క్‌లో భాగస్వాములు కావాలని నిర్మాతలు కోరుతున్నారు. వారికి రెమ్యునరేషన్ ఇవ్వకుండా వచ్చి న లాభాల్లో వాటాలు మాత్రమే ఇచ్చే పాలసీని అమలు చేయా లని కోరుతున్నారు.

నడిగర్ సంగం (నటుల సంఘం) ఈ ప్రతిపాదనకు సహకరించకపోతే నిరవధికంగా షూటింగ్స్ నిలిపివేస్తామని ఇది వరకే హెచ్చరించారు. పారితోషికాల నియంత్రణ, సినిమా నిర్మాణ వ్యయం తగ్గించడం ద్వారానే కోలీవుడ్ మనుగడ సాధ్యమని వారు బలంగా నమ్ముతున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం సెట్స్పై ఉన్న సుమారు 30కి పైగా చిత్రాల షూటింగ్ పనులు నిలిచిపోయాయి.

ఇది కేవలం కోలీవుడ్‌కే పరిమితం కాకుండా, ఒకవేళ ఇక్కడ రెవెన్యూ షేరింగ్ మోడల్ సక్సెస్ అయితే ఇతర భారతీయ చిత్ర పరిశ్రమలపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నటులు, ఇతర సాంకేతిక నిపుణులతో నిర్మాతల మండలి జరిపే చర్చలపైనే ఈ సమ్మె భవిష్యత్తు ఆధారపడి ఉంది. పారితోషికం రూపంలో కాకుండా లాభాల్లో వాటా తీసుకోవడం వల్ల నటులపై ఒత్తిడి పెరు గుతుందని నడిగర్ సంగం భావిస్తోంది. అయితే, నిర్మాతలను రక్షించుకోకపోతే భవిష్యత్తులో చిత్ర నిర్మాణం కష్టమవుతుందని టీఎఫ్‌పీసీ స్పష్టం చేస్తోంది.