8 March, 2026 | 4:30 PM

అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు

08-03-2026 02:37 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం బీటీఎస్ చౌరస్తా సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో చిన్నారితో సహా ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

వికారాబాద్ జిల్లా తాండూర్‌కు చెందిన వరప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి నిర్మల్ జిల్లా బాసరకు చిన్నారి అక్షరాభ్యాసం కోసం కారులో బయలుదేరారు. బీటీఎస్ చౌరస్తా దాటి సర్వీస్ రోడ్డుకు చేరుకునే సమయంలో ముందున్న లారీ ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో కారు డివైడర్ ఎక్కి సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది.

ప్రమాదంలో కారులో ఉన్న అంబిక, మౌనిక, చెరుకు మల్లి స్వర్ణ, నైనిక, రుగ్వేద్ నందక్ అనే చిన్నారికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న జీఎంఆర్ సిబ్బంది, భిక్కనూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని జీఎంఆర్ అంబులెన్స్‌లో కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో హైవేపై ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.