13 June, 2026 | 1:51 AM

ముంపులేని తుమ్మిడిహట్టి!

13-06-2026 12:44 AM
  1.   150 మీటర్ల ఎత్తులోనే బరాజ్  
  2. ప్రాజెక్టు నిర్మాణానికి కసరత్తు వేగవంతం 
  3. నూతన అలైన్‌మెంట్ రూపకల్పనలో ఇంజినీరింగ్ నిపుణులు
  4. చాప్రాల్ అభయారణ్యానికి తప్పనున్న ముంపు సమస్య   
  5. పర్యావరణ అనుమతులు సులభం
  6. మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందని ఆశాభావం

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి) : ప్రాణహిత--చేవెళ్ల ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. మహారాష్ట్రతో చర్చల ద్వారా ముంపు సమస్యను నివారించి, గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు కొత్త అలైన్‌మెంట్ సిద్ధం చేస్తోంది. నూతన డిజైన్ ప్రకారం బరాజ్ 150 మీటర్ల ఎత్తుతో నిర్మించినా మహారాష్ట్ర భూభాగంలో గానీ, చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో గానీ ముంపు సమస్య ఉండదని అధికారుల అంచనా.

ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద వంతెన నిర్మా ణం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనూ కీలక ప్రాజెక్టుగా పరిగణించారు. అయితే అప్పట్లో ప్రతిపాదించిన డిజైన్ ప్రకారం బరాజ్‌ను 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే మహారాష్ట్రలో దాదాపు 1,500 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు గుర్తించా రు. ఇందులో అటవీ భూములు, ముఖ్యంగా చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని ప్రాంతాలు కూడా ఉండటంతో మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు సిద్ధం గా ఉన్నప్పటికీ మహారాష్ట్ర అంగీకరించలేదు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య చర్చల అనంతరం బరాజ్ ఎత్తును 148 మీటర్లకు కుదించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనతో ముంపు ప్రభావం సుమారు 270 ఎకరాలకు తగ్గినప్పటికీ, నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది. ప్రాజెక్టు అసలు లక్ష్యాలకు అనుగుణంగా నీటి లభ్యత ఉండదని భావించిన తెలంగాణ సర్కార్.. ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లలేదు.

తెరపైకి కొత్త అలైన్‌మెంట్

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుం గుబాటు తర్వాత ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం... మళ్లీ తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పరిశీలిస్తోంది. ముఖ్యంగా గోదావరి జలాలను పూ ర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో తుమ్మిడిహట్టికి ప్రాధాన్యం పెరిగింది. ఈ నేప థ్యంలో ఇరిగేషన్ అధికారులు కొత్త అలైన్‌మెంట్‌ను రూ పొందించారు.

గతంలో ప్రతిపాదించిన డిజైన్‌కు భిన్నం గా రెండు బరాజ్‌ల నిర్మాణం, వాటిని అనుసంధానించే నాన్ ఓవర్ ఫ్లో సెక్షన్ ఏర్పాటు వంటి మార్పులు చేశారు. వైన్ గంగా నదిపై నిర్మించే బరాజ్ స్థానాన్ని కూడా కొంత వెనక్కి మార్చారు. ఈ మార్పుల వల్ల బ్యాక్ వాటర్ ప్రభావం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నా రు. గతంలో మహారాష్ట్ర అత్యంత ఆం దోళన వ్యక్తం చేసిన అంశాల్లో చాప్రా ల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఒకటి.

బరాజ్ వల్ల అభయారణ్యం ముంపునకు గురవుతుందనే వాదనతోనే ఆ రాష్ట్రం అనుమతులు నిరాకరించింది. అయితే తాజా అలైన్‌మెం ట్ ప్రకారం చాప్రాల్ అభయారణ్యానికి ఎలాంటి ముప్పు ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. అటవీ భూము లు మునిగే అవకాశం కూడా లేదని చెబుతున్నారు. వైన్ గంగా, వార్ధా నదుల పరీవాహక ప్రాంతాల్లో నీటి నిల్వ లు పెరిగినా, అది కేవలం క్యాచ్‌మెంట్ విస్తరణకే పరిమితమవుతుందని, శాశ్వత ముంపు పరిస్థితులు ఏర్పడవని వివరిస్తున్నారు. నదుల బఫర్ జోన్లపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు. 

సమగ్ర సర్వేతో స్పష్టత

కొత్త అలైన్‌మెంట్‌కు సంబంధించిన ముంపు అంచనాలపై ప్రస్తుతం సమగ్ర సర్వే కొనసాగుతోంది. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఆర్వీ అసోసియేట్స్‌తో పాటు ఐఐటీ నిపుణులు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నారు. ముంపు పరిధి, బ్యాక్‌బాటర్ ప్రభావం, పర్యావరణ అంశాలు, అటవీ భూములపై ప్రభావం వంటి అంశాలను శాస్త్రీయంగా పరిశీలిస్తున్నారు. ఈ నివేదిక పూర్తయిన తర్వాతే ప్రాజెక్టుకు సంబంధించిన తుది సాంకేతిక ప్రతిపాదనలు సిద్ధం కానున్నాయి.

నివేదికలో ముంపు లేదని నిర్ధారణ అయితే మహారాష్ట్రను ఒప్పించడం మరింత సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం కూడా కీలక అంశమే. గతంలో 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ సుముఖత వ్యక్తం చేసింది.

ఇప్పుడు కొత్త అలైన్‌మెంట్‌తో ముంపు మరింత తగ్గే అవకాశం ఉండటంతో పర్యావరణ అనుమతులు పొందడంలో పెద్దగా ఇబ్బందులు ఉండవన్నది అధికారుల అంచనా. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి సాంకేతిక అనుమతులు పొందిన తర్వాత పర్యావరణ క్లియరెన్సులు కూడా వేగంగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

మహారాష్ట్ర అంగీకారంపైనే తెలంగాణ ఆశలు

తెలంగాణ ప్రభుత్వం ఆశలన్నీ మహారాష్ట్ర అంగీకారంపైనే ఉన్నాయి. ఇప్పటివరకు ముంపు సమస్యను చూపుతూ ఆ రాష్ట్రం తుమ్మిడిహట్టికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చింది. కొత్త డిజైన్‌తో ముంపు ఉండదని శాస్త్రీయంగా నిరూపించగలిగితే వ్యతిరేకించడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా కారణాలు ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

కానీ ఇది కేవలం సాంకేతిక అంశం మాత్రమే కాకుండా రాజకీయ, అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించినది కావడంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగే చర్చలు కీలకం కానున్నాయి. సర్వే నివేదికలు, సాంకేతిక అనుమతులు, రాజకీయ చర్చలు సానుకూలంగా సాగితే తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి  గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని ప్రభు త్వ వర్గాలు అంటున్నాయి.