ఆన్‌లైన్‌లో ఆరోగ్యం.. నమ్మితే ముప్పే!
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వెల్లువ
సంచలన, భావోద్వేగ కంటెంట్‌తో జాగ్రత్త
మార్కెటింగ్ వ్యూహాల వలలో చిక్కొద్దు
అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ఆన్‌లైన్ వేదికలపై తప్పుడు ఆరోగ్య సమాచారం విపరీతంగా పెరిగిపోవడాన్ని.. నిపుణులు ఇన్ఫోడెమిక్ (సమాచార మహమ్మారి)గా అభివర్ణిస్తున్నారు. ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనిపై అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలతో పాటు వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటువంటి అశాస్త్రీయ ప్రచారాలు.. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడమే కాకుండా, రుజువులేని, నిర్ధారించని చికిత్సలను ప్రోత్సహిస్తూ, శాస్త్రీయ వైద్య విధానాలపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే కనీసం ఆరు రకాల అపోహలను నిజమని నమ్ముతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
ఏదైనా ఆరోగ్య సమాచారాన్ని నమ్మే ముందు లేదా ఇతరులతో పంచుకునే ముందు, అది నిజమా.. కాదా అనేది సరిచూసుకోవడం ఎంతో అవసరమని ప్రముఖ పోషకాహార నిపుణులు, ప్రొఫెసర్ డాక్టర్ సాయిబాబా అయ్యగారి స్పష్టంగా చెబుతున్నారు. సదరు సమాచారం అర్హత కలిగిన వైద్యులు, గుర్తింపు పొందిన ఆసుపత్రులు, విశ్వవిద్యాల యాలు లేదా ప్రజా ఆరోగ్య సంస్థల నుంచి వచ్చిందా? దానికి శాస్త్రీయ పరిశోధనల మద్దతు ఉందా? లేదా? అనేది గమనించాలని ఆయన సూచిస్తున్నారు.
ఆయన అభిప్రాయం ప్రకారం... అద్భుత నివారణ (మిరాకిల్ క్యూర్), క్షణాల్లో బరువు తగ్గుతారు (ఇన్‌స్టాంట్ వెయిట్ లాస్), లేదా 100 శాతం కచ్చితమైన ఫలితాలు వంటి ఆకర్షణీయమైన పదాలతో ప్రచారమయ్యే విషయాలపై వెంటనే అనుమానం పెంచుకోవాలని ఆయన సూచించారు. ఇటువంటి తప్పుడు సమాచారం వల్ల రోగులు అసలైన వైద్య చికిత్సను ఆలస్యం చేయడం, వాడుతున్న మందులను మధ్యలోనే ఆపేయడం, ఎలాంటి ఉపయోగం లేని హానికరమైన రెమెడీల కోసం డబ్బులు వృథా చేసుకోవడం వంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విరివిగా ప్రచారమవుతున్న కొన్ని ప్రధాన అపోహలను డాక్టర్ అయ్యగారి ప్రస్తావించారు. డిటాక్స్ డ్రింక్స్ తాగితే శరీరంలోని విషపదార్థాలన్నీ తొలగిపోతాయని, కేవలం మూలికా వైద్యంతోనే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చని నమ్మించడం లాంటివి అందులో కొన్ని. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి రాగానే డయాబెటిస్ మందులు ఆపేయవచ్చని, వ్యాక్సిన్ల వల్ల సంతానలేమి లేదా ఆటిజం వస్తుందని ప్రచారం చేయడం ముమ్మాటికీ అపోహలేనని ఆయన స్పష్టం చేశారు.
నిమ్మరసం లేదా ఆల్కలైన్ డైట్ వల్ల పెద్దపెద్ద జబ్బులు నయమవుతాయని, కొన్ని ప్రత్యేక ఆహారాలు కొవ్వును వేగంగా కరిగిస్తాయని, విటమిన్లు ఎక్కువగా తీసుకుంటే ఇన్ఫెక్షన్లు రావని, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అందరికీ సరిపోతుందని నమ్మడం కూడా తప్పేనని ఆయన వివరించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తాజా ట్రెండ్‌ల వెంట పడటం కంటే, సాంప్రదాయ, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించడం చాలా ముఖ్యమన్నారు. ఆన్‌లైన్ సమాచారాన్ని షేర్ చేసే ముందు.. లేదా పాటించే ముందు ఒక్క క్షణం ఆగండి. ధ్రువీకరించుకున్న తర్వాతే నమ్మండి అని డాక్టర్ అయ్యగారి హితవు పలికారు.
సంచలనాత్మక, భావోద్వేగ కంటెంట్‌తో జాగ్రత్త
కిమ్స్ ఆసుపత్రికి చెందిన ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆరతి బెల్లారి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తప్పుడు ఆరోగ్య సమాచారం ప్రమాదకరమైన స్థాయికి చేరిందన్నారు. చాలావరకు ఈ కంటెంట్ శాస్త్రీయత కంటే ప్రజలను భావోద్వేగాలతో ఆకట్టుకునేలా, సంచలనాత్మకంగా ఉండేలా రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎప్పుడూ తక్షణ పరిష్కారం కోసమే చూస్తుంటారు. కానీ దీనివల్ల కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల ఆన్‌లైన్ ఆయుర్వేద చికిత్సలకు ఆదరణ పెరుగుతుండటంపై డాక్టర్ బెల్లారి ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం అశాస్త్రీయ ఆన్‌లైన్ రెమెడీలపైనే ఆధారపడి, వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ సమాచార మహమ్మారి (ఇన్ఫోడెమిక్) వల్ల టీకాలు వేయిం చుకోవడానికి కూడా ప్రజలు వెనుకాడే పరిస్థితి వస్తోందని, వ్యాధి నిరోధకత అనేది అత్యంత కీలకమైన సమయంలో ఇలా వెనుకాడటం సరికాదని ఆమె అన్నారు.
చాట్ జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలు కేవలం సాధారణ సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలవని, అవి ఎప్పటికీ ఒక వైద్యుడి నిర్ధారణకు, ప్రిస్క్రిప్షన్‌కు లేదా చికిత్స ప్రణాళికకు ప్రత్యామ్నాయం కావని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, అలాగే కొందరు ఆరోగ్య నిపుణులు కూడా సరైన ఆధారాలు లేకపోయినప్పటికీ ప్రోటీన్ పౌడర్లు, గమ్మీలు, సప్లిమెంట్లను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారని ఆమె విమర్శించారు.
‘ట్రాన్స్‌ఫర్మేషన్’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి
ప్రముఖ పోషకాహార, వెల్నెస్ నిపుణురాలు రుజుతా దివేకర్ మాట్లాడుతూ... సోషల్ మీడియాలో కనిపించే ‘ట్రాన్స్‌ఫర్మేషన్’ (లావు నుంచి సన్నగా మారినట్లు చూపే) ఫొటోలు, మన ఆరోగ్యంపై పట్టింపు ఉన్నట్లు నటించే కంటెంట్, పేయిడ్ పార్ట్‌నర్‌షిప్ (డబ్బులు తీసుకుని చేసే ప్రచారాలు) వివరాలను వెల్లడించని పోస్టుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ ఆహార నియమాలైనా సరే... సోషల్ మీడియా ట్రెండ్లను బట్టి కాకుండా, సదరు వ్యక్తి జీవనశైలి, సంస్కృతి, వయస్సు, బడ్జెట్‌కు అనుగుణంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు.
మార్కెటింగ్ వ్యూహాలు.. సైన్స్‌ను దెబ్బతీస్తున్నయ్
సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్లు (మధుమేహం వల్ల వచ్చే పాదాల పుండ్లు), ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్న రోగులను తాము రోజూ చూస్తున్నామని స్పెషలిస్ట్ డాక్టర్ ఆరతి బెల్లారి తెలిపారు. ఎల్లప్పుడూ లోతుగా జరిగే శాస్త్రీయ పరిశోధనల ఆధారంగానే వైద్యపరమైన సిఫారసులు నిర్ధారిస్తారని, కానీ చాలామంది హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్లు చిన్నచిన్న అధ్యయనాలను ఆధారంగా చేసుకుని సలహాలు ఇస్తుంటారని ఆమె హెచ్చరించారు.
మరోవైపు.. మార్కెటింగ్ వ్యూహాలు.. సైన్స్‌కు, యాడ్స్‌కు మధ్య గల సన్నటి గీతను చెరిపేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు టూత్‌పేస్ట్ ప్రకటనలను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. దంతాల రక్షణకు ‘ఫ్లోరైడ్’ అత్యంత కీలకమైన మూలకం అయినప్పటికీ.. కేవలం మార్కెటింగ్ కోసం ‘ఉప్పు’ వంటి సహజ సిద్ధమైన పదార్థాలనే ప్రధానంగా ప్రమోట్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు.






