కోతల పేరిట దోపిడీ!
- మిల్లులు, గోదాముల్లోనూ రైతులకు తిప్పలు
- మంచిర్యాల జిల్లాలో 41 కోట్లు నష్టపోయిన అన్నదాతలు
- యాసంగికి 1.98 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
- క్వింటాలుకు 7 నుంచి 10 కిలోల కోతతో 32.91 కోట్ల నష్టం
- ఏ-గ్రేడ్ రకాలే లేవంటూ సాధారణ రకంగా కొనుగోళ్లతో 3.80 కోట్లు లాస్
- లోడింగ్, అన్ లోడింగ్ పేరిట లారీల కోసం 4.90 కోట్లు వసూలు
- మొత్తంగా 41.61 కోట్లు- నష్టపోయిన 35,121 మంది రైతులు
- రైతుల నుంచి గుంజిన డబ్బుల్లో ఎవరి వాటా ఎంత?
మంచిర్యాల, జూన్24(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో గత యాసంగి సీజ న్‌లో ధాన్యం కొనుగోళ్లలో వివిధ రకాల కోతలు, అదనపు వసూళ్లతో ఈ జిల్లా రైతులు 35,121 మంది దాదాపు రూ. 41.61 కోట్లు నష్టపోయారు. మిల్లులు, గోదాముల్లోనూ రైతులకు కోతల తిప్పలు తప్పలేదు. క్వింటాలుకు 7 నుంచి 10 కిలోల కోతతో రూ.32.91 కోట్లు, ఏ-గ్రేడ్ రకాలే లేవంటూ సాధారణ రకంగానే ధా న్యం కొనడంతో రూ.3.80 కోట్లు, లోడిం గ్, అన్ లోడింగ్ పేరిట లారీల కోసం వసూలు చేయడంతో రూ.4.90 కోట్లు నష్టపోయారు.
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజా కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం రైతులను అష్టకష్టాలు పెట్టి, అడ్డగోలు కోతలు విధించి కొనుగోలు చేసిందని మంచిర్యాల జిల్లా రైతులు బాహాటంగానే పేర్కొంటున్నారు. కొంత మంది రైతులైతే వారు ఎదుర్కొన్న కష్టాలను, పండించిన దానిలో పెట్టిన కోతలను వివరిస్తూ ఆయా గ్రామాల వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాలలో వీడియోలు పెడుతున్నారు. అధికారులు, నాయకులు వాటిని ఆ గ్రూపులలో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చి, అంతా మంచిగా జరిగిందని లేఖలు రాయించుకుంటున్నారు.
అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. మంచిర్యాల జిల్లాలో గడిచిన యాసంగి సీజన్‌లో డీఆర్డీఏ(ఐకేపీ), మెప్మా, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఏజెన్సీల ద్వారా 318 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించారు. నాలుగు ట్రాన్స్ ఫోర్టు క్లస్టర్లుగా విభజించి పీపీసీల నుంచి మిల్లులకు తరలించేందుకు లారీలను సమకూర్చారు. ఇదంతా కాగితపు లెక్కల్లో బాగానే ఉన్నా గ్రౌండ్‌లో మాత్రం లారీల కొరతే, మామూళ్లు వసూలే కనిపించింది.
ధాన్యం కోతలు.. 32.91 కోట్ల నష్టం
యాసంగిలో కొనుగోలు కేంద్రం నుంచి సివిల్ సప్లయ్ అధికారులు కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించారు. మొదటి నుంచే మిల్లర్లు రైతులు పండించిన ధాన్యాన్ని వంద రకాల కారణాలతో కోతలు కోయడం ప్రారంభించారు. 40 కిలోల బస్తాకు 3-4, కొన్ని సందర్భాలలో 4-5 కిలోల వరకు కోతలు విధించారు. అంటే క్వింటాలుకు సుమారు ఏడు నుంచి పది కిలోలు కోత విధించారు.
ఈ ఏడాది జిల్లాలో 1,98,500 టన్నుల (19,85,000 క్వింటాళ్లు) ధాన్యం రైతుల నుంచి సేకరించగా, క్వింటాలుకు సుమారు ఏడు కిలోల చొప్పున 1,38,950 క్వింటాళ్లు (1,38,95,000 కిలోలు) కోత విధించారు. అంటే క్వింటాలుకు సాధారణ రకం ధాన్యం ధర రూ.2,369గా పరిగణించి లెక్కిస్తే 32,91,72,550 రూపాయలు రైతులు నష్టపోయినట్లే. రైతులు ఎన్ని రాస్తారోకోలు, ధర్నాలు చేసినా, ఏ అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమే అయ్యింది. ఇక చేసేదేమి లేక ఏడుస్తూ ధాన్యాన్ని విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.
సాధారణ రకమేనంటూ కొన్నరు.. 3.80 కోట్లు లాస్
యాసంగి సీజన్‌లో ఎక్కువ శాతం త్వరగా చేతికి వచ్చే పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ఇది వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్‌లో సైతం తేటతెల్లమవుతుంది. 1001 సీడ్ వెరైటీ సాధారణ రకానికి చెందినవి కాగా, 1010 వెరైటీ సీడ్ ‘ఏ’ గ్రేడ్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం గుర్తించిన సన్నాలు మాత్రమే బోనస్‌కు అర్హత. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఈ ఏడాది 1,98,500 టన్నులు ధాన్యం కొనుగోలు చేయగా ఇందులో దొడ్డు రకానికి 1,97,979 టన్నులు, సన్నాలు 485 టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారులు చెపుతున్నారు.
క్వింటాలుకు ‘ఏ’ గ్రేడ్‌కు రూ.2,389, సాధారణ రకాలకు రూ.2,369, సన్నాలకు రూ.2,889 (ఏ గ్రేడ్, బోనస్ రూ.500) చెల్లించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ‘ఏ’ గ్రేడ్ ధాన్యం పండనట్టుగా సాధారణ గ్రేడ్‌గానే కొన్నారు. దీంతో రైతులు క్వింటాలుకు రూ.20 చొప్పున నష్టపోయారు. 19,79,790 క్వింటాళ్లకు సుమారు రూ.3.80 కోట్ల వరకు రైతులు నష్టపోయారు.
లారీలు పంపేందుకు 4.90 కోట్లు వసూలు!
రైతులు పండించిన పంట అమ్ముకునేందుకు వేసే తూకానికి క్వింటాలుకు ఆ ప్రాంతంలో కాంటా మొదలయ్యే సమయంలో గ్రామ రైతులంతా కూడి కూలీని నిర్ణయించుకొని రూ.40 నుంచి రూ.60 వరకు చెల్లిస్తుంటారు. కానీ అవినీతికి అలవాటు పడ్డ లారీ కాంట్రాక్టర్లు, లారీ యాజమానులు లారీ కేంద్రానికి రావాలంటే బస్తాకు రూ.10 నుంచి రూ.15 ఇస్తేనే వస్తామనే నిబంధన పెట్టి లారీల కొరత పేరిట ఒక్కో లారీకి రూ.6 వేల నుంచి రూ.10 వేలు దండుకున్నారు. అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం 1,98,500 టన్నుల ధాన్యాన్ని 40 కిలోల సంచులలో నింపితే సుమారు 49,62,500 బ్యాగులు అవసరమవుతాయి. సంచికి కనీసం పది రూపాయల తీసుకుంటే రైతులపై రూ.4.90 కోట్ల భారం పడినట్లైంది.
మిల్లులు, గోదాముల్లో అదే తీరు
కొన్న ధాన్యాన్ని మిల్లులతో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు గోదాముల్లో నిల్వ చేశారు. గోదాముల బాధ్యతను ఎస్‌డబ్ల్యూసీ (స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్)కి అప్పగించారు. అయితే మిల్లర్లు బస్తాకు ౩ నుంచి ౪ కిలోలు కోత విధిస్తే, మేమేం తక్కువ కాదన్నట్లుగా గోదాములలో దించిన ధాన్యానికి సైతం బస్తా బస్తాకు కోత విధించారు. జిల్లాలో 318 కొనుగోలు కేంద్రాల నుంచి తరలించిన ఒక్కొక్క లారీ ట్రక్ షీట్‌ను గమనిస్తే ఒక్కో లారీకి ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కోత విధించారో అర్థమవుతుంది.
ఇలాంటి వాటిని ఖండించే అధికారులు ఒక్కసారి రబీ సీజన్ ట్రక్ షీట్లను పరిశీలిస్తే వారికే అర్థమవుతుంది. మిల్లు వద్ద కోత విధిస్తే, అంతే మొత్తంలో గోదాముల వద్ద కోతలు విధించారు. అక్కడంటే మిల్లర్ మింగిండు, మరి గోదాముల ధాన్యం ఎవరు మింగుతుండ్రు, ఇందులో ఎవరి వాటా ఎంత? అధికారులకు ఎంత, నాయకులకు ఎంత అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యే గారు స్పందించండి
వడ్ల సెంటర్ నుంచి మాకిచ్చినవి 40 కిలోల బ్యాగులు. ఒక్కొక్క బస్తాకు 4 కిలోలు కట్ చేస్తుండ్రు. క్వింటాలుకు పది కిలోలు పోతున్నయ్. హమాలీ కూలీ వేరే. మేమే వడ్లు నింపుకున్నాం, మేమే కుట్లు వేసుకున్నాం, మేమే కాంటా చేసుకున్నాం. అయినా క్వింటాలుకు వంద రూపాయల చొప్పున తీసుకున్నరు. వడ్లు పోయి నెల రోజులైనా ట్రక్ షీట్ ఇవ్వడం లేదు.
సెంటరోల్లు (పీఏసీఎస్ కోటపల్లి సీఈవీ లక్ష్మారెడ్డి) మిల్లుల్లో కట్ అయిన కాగితం ఇవ్వమంటే ఇయ్యమని, మేం రాసిచ్చిందే తీసుకోవాలంటున్నరు. నెల రోజులైనా డబ్బులు రాకుంటే పరిస్థితి ఎట్లుంటది. మా మాటలు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలే. వడ్లు కటింగ్ కాకుండా మావి మాకు వచ్చేటట్లు ఎమ్మెల్యే గారు చూడాలే.
బెడికె లక్ష్మీ, ఆలుగామ, కోటపల్లి






