తెలంగాణలో ఇంధన సెగ!
- దేశంలోనే అత్యధిక ధరలు ఇక్కడే
- పెట్రోల్‌పై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం
- 200 లీటర్ల పరిమితితో రవాణా, వ్యవసాయ రంగాలు అస్తవ్యస్తం
- ఆంక్షల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లోనూ ఇంధన కష్టాలు
సంగారెడ్డి, జూన్ 24 (విజయక్రాంతి): అంతర్జాతీయంగా పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల చమురు సంస్థలు వరుసగా ధరలు పెంచడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. భారతదేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధరలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.
తెలంగాణలో పెట్రోల్‌పై దాదాపు 35.2 శాతం వ్యాట్, డీజిల్‌పై 27 శాతం విధిస్తుండటం వల్ల ఈ భారం మరింత పెరిగింది. ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.115.73, డీజిల్ రూ.103.82, వరంగల్‌లో పెట్రోల్ రూ.115.13, డీజిల్ రూ.103.292 లకు అమ్ముతున్నారు.
200 లీటర్ల ఆంక్షల ఎఫెక్ట్.. బల్క్ దోపిడీకి బ్రేక్
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ బంకుల్లో బల్క్ కొనుగోళ్లపై 90 రోజుల పాటు తాత్కాలికంగా విధించిన 200 లీటర్ల రోజువారీ పరిమితి తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాస్తవానికి ఇండస్ట్రియల్ వినియోగానికి వాడే బల్క్ డీజిల్ ధర లీటరుకు రూ.134.50 ఉండగా, రీటైల్ బంకుల్లో రూ.95 నుంచి -రూ.103 మధ్య ఉంది. ఈ భారీ వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని టెలికాం టవర్ ఆపరేటర్లు, భారీ పరిశ్రమలు రీటైల్ బంకుల నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేస్తుండటంతో, సాధారణ వినియోగదారులకు కొరత ఏర్పడకుండా కేంద్రం ఈ 200 లీటర్ల నిబంధన తెచ్చింది. అయితే హైదరాబాద్ మీదుగా సుదూర ప్రాంతాలకు వెళ్లే నేషనల్ హైవే ట్రక్కులు ఒకే బంకులో ట్యాంక్ ఫుల్ (సాధారణంగా 300--400 లీటర్లు) చేసుకునే అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ రైతాంగంపై డీజిల్ దెబ్బ
రాష్ర్టంలో ప్రస్తుత ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో డీజిల్ ధరల పెంపు రైతులకు పెద్ద శాపంగా మారింది. ట్రాక్టర్ల ద్వారా పొలాలు దున్నడానికి, నీటి పంపుసెట్ల నిర్వహణకు, అలాగే పండించిన ధాన్యాన్ని మార్కెట్లకు తరలించే రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను నియంత్రించకపోవడం వల్ల సాగు వ్యయం భారమై నష్టపోతున్నామని రైతులు అంటున్నారు.
మాజీ ఆర్థిక మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ముందు ఇంధన ధరలు తగ్గిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేస్తూ, ప్రజలపై భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ శాతాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.
పౌరసరఫరాల శాఖ ఏమంటున్నది?
ఇంధన ధరలు, కొనుగోలు ఆంక్షల వార్తల నేపథ్యంలో గతంలో హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, అమీర్‌పేట్ వంటి ప్రాంతాలతో పాటు జిల్లాల్లో సైతం బంకుల్లో వాహనదారులు క్యూ కట్టడం, కొన్నిచోట్ల ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడం కలకలం రేపింది. దీనిపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పందిస్తూ.. రాష్ర్టంలో ఇంధన కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లేదా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి వస్తున్న ఒత్తిడి వల్లే కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోతోందని అధికారులు సూచించారు.
ఇలావుండగా లారీ అసోసియేషన్లు బంకుల్లో రోజువారీ 200 లీటర్ల పరిమితిని కమర్షియల్ వాహనాలకు మినహాయించాలని కోరుతున్నాయి. డీజిల్ ధరల పెంపు వల్ల హైదరాబాద్ హోటళ్లలో ఫుడ్ రేట్లతో పాటు మార్కెట్లో కూరగాయల ధరలు 15 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినా రవాణా వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చేదాకా దేశంలో ఇంధన ధరల తగ్గింపు తక్షణమే సాధ్యం కాదని కేంద్ర చమురు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి స్పష్టం శారు.






