గచ్చిబౌలి అల్‌సబా హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడి!
కంపుకొడుతున్న కిచెన్ అపరిశుభ్ర ఫ్రీజర్లు
శేరిలింగంపల్లి, జూలై 10 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం బిర్యానీలకు ప్రసిద్ధి చెందిన ఐటీ కారిడార్‌లోని(IT Corridor) ప్రముఖ హోటళ్లలో ఆహార భద్రతా ఉల్లంఘనలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ నేపథ్యంలో గచ్చిబౌలిలోని ‘అల్‌సబా’ రెస్టారెంట్‌పై ఆహార భద్రతా అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. తనిఖీలో హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం, తిండి ప్రియుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరు చూసి అధికారులే షాక్‌కు గురయ్యారు. కార్మికులు వాడే అపరిశుభ్రమైన వాష్‌రూమ్‌కు సరిగ్గా పక్కనే ఎలాంటి మూతలు లేకుండా రుమాలి రొట్టెలు తయారు చేస్తున్న దృశ్యాలు ఇక్కడ కలకలం రేపాయి. కిచెన్ లోపల ఈగలు ముసురుతున్న వాతావరణంలో చికెన్‌ను పడేయడం, ఫ్రీజర్‌లో మాంసాన్ని కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం నిల్వ చేయడం అధికారులు గుర్తించారు.
పాత్రలు కడిగే వాష్ ఏరియాలో నీరంతా నిల్వ ఉండిపోయి తీవ్ర కంపు వస్తోంది. హోటల్‌లో వాడే నీటి నాణ్యత పరీక్ష నివేదికలు, వంట చేసే మాస్టర్ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు యాజమాన్యం దగ్గర లేవని తేలింది. కనీస ఆరోగ్య, పరిశుభ్రత ప్రమాణాలను పూర్తిగా విస్మరించినట్లు అధికారులు గమనించారు.ఈ ఉల్లంఘనలపై అల్‌సబా హోటల్ యాజమాన్యానికి ఆహార భద్రతా అధికారులు నోటీసులు జారీ చేశారు. త్వరలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లోని అనేక హోటళ్లపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ప్రముఖ రెస్టారెంట్లలో కూడా స్టేల్ ఫుడ్, రీయూజ్డ్ ఆయిల్, పెస్ట్ ఇన్ఫెస్టేషన్ వంటి సమస్యలు బయటపడుతున్నాయి. భోజనం చేసేటప్పుడు హైజీన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఈ రకమైన ఉల్లంఘనలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు కూడా సహకరించి అనుమానాస్పద సంఘటనలను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.






