16 April, 2026 | 1:42 AM

పదవి ఊడగానే గజినీలైన బీజేపీ మాజీ కార్పొరేటర్లు

16-04-2026 12:14 AM

ఐదేళ్లు దోచుకుని.. ఇప్పుడు ‘పోరాట’ డ్రామాలు

ఎల్బీనగర్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : ఉన్నప్పుడు అందినకాడికి దండుకుని, ఇప్పుడు పదవి పోగానే ప్రజా సమస్యల మీద ‘మమకారం’ వలకబోస్తున్నారు ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ మాజీ కార్పొరేటర్లు. ‘గజినీ’ సినిమా తరహా లో తమ ఐదేళ్ల వైఫల్యాలను మర్చిపోయి, ఇప్పుడు వింతగా ప్రవర్తిస్తూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో  రాజకీయ ఉనికి కోసం వీరు ఆడుతున్న ‘వినతిపత్రాల’ నాటకాన్ని చూసి స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కార్పొరేటర్లుగా ఉన్న సమయం లో అభివృద్ధిని గాలికి వదిలేసి, వసూళ్ల పర్వానికే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కమీషన్ల కక్కుర్తి..

కొత్త నిర్మాణం కనిపిస్తే చాలు, తమ అనుచరులను పంపి బిల్డర్లను వేధించడం వీరికి అలవాటుగా మారింది. పార్కు స్థలాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోకుండా, అక్రమ నిర్మాణా ల్లో భాగస్వాములుగా మారి ఖజానాకు గండి కొట్టారనే అపవాద పలువురు కార్పొరేటర్లు మూట గట్టుకున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారుల విధుల్లో జోక్యం చేసుకుంటూ, అక్రమ పనులకు అధికార ముద్ర వేయించుకున్నారు.

మార్నింగ్ వాక్ పేరిట ’పబ్లిసిటీ స్టంట్లు’గడ్డిఅన్నారం నుంచి హయాత్నగర్ వరకు ప్రతి డివిజన్లోనూ తెల్లవారకముందే ‘మార్నింగ్ షో’ లు మొదలెట్టారు. అనుచరుల బలగంతో కాలనీల్లో తిరుగుతూ, ప్రజల నుంచి వినతిపత్రా లు తీసుకుంటూ ఫోటోలకు ఫోజులివ్వ డమే వీరి నిత్యకృత్యం. గతంలో సమస్య లు చెప్పడానికి వచ్చిన వారిని గంటల తరబడి ఇంటి చుట్టూ తిప్పించుకున్న వీరు, ఇప్పుడు ‘ప్రజా సేవకుల’ అవతారం ఎత్తడం గమనార్హం.

అధ్వానంగా డివిజన్లు.. తీరని ముంపు కష్టాలు..

ఐదేళ్ల బీజేపీ పాలనలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. లింగోజిగూడ, చంపాపేట, మన్సూరాబాద్ వంటి ప్రాంతాల్లో వరద కాలువల పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన కెమెరాలు ఇప్పుడు కేవలం ‘దిష్టిబొమ్మలు’గా మారాయి. మూసీ తీర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. దోమల బెడదతో ప్రజలు రోగాల బారిన పడుతున్నా ఎంటామాలజీ విభాగం ఊసే లేదు. జనాభా పెరిగినా ట్రాన్స్ఫార్మర్లు పెరగలేదు, ఉన్న వీధి దీపాలు వెలగడం లేదు.

ఇంకా ‘కార్పొరేటర్’ భ్రమలోనే..

పదవీ కాలం ముగిసినా, తామే ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో కొంతమంది మాజీలు బతుకుతున్నారు. అధికారు లను పిలిపించి ఆదేశాలు ఇవ్వడం, అభివృద్ధి పనులను తమ పర్యవేక్షణలో జరుగుతున్నట్లు బిల్డప్ ఇవ్వడం చూసి జనం నవ్వు కుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడానికి, ప్రజలు తమను మర్చిపోకుండా ఉండటానికి ఈ ‘రాజకీయ విన్యాసాలు’ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అధికారంలో ఉన్నప్పు డు గుర్తుకురాని సమస్యలు, ఇప్పుడు మాజీలవగానే ఎలా కనిపిస్తున్నాయి?‘ అని ఎల్బీనగర్ వాసులు ప్రశ్నిస్తున్నారు.