బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ములుగు కలెక్టర్ దివాకర టి.ఎస్.
మంగపేట, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): ఏప్రిల్ 27 నుంచి మే 5వ వరకు జరిగే మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాలను కలెక్టర్ పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు, సమన్వయంతో పనిచేసి భక్తులకు స్వామి వారి దర్శనం సులభతరం చేయాలి అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం క్యూ లైన్లలో నిరంతరం మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఆలయ పరిసరాల్లో, స్నానపు ఘాట్ల వద్ద పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉత్సవాలు ముగిసే వరకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని, వాహనాల పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు అందించే ప్రసాదం నాణ్యతగా ఉండాలని, అన్నదాన కార్యక్రమాల వద్ద తోపులాట జరగకుండా క్రమశిక్షణతో కూడిన ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీకి సూచించారు.
ఉత్సవాల సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈవో వీరస్వామి, డిపిఓ వెంకయ్య, ఆర్డబ్ల్యూఎస్ మాణిక్యరావు, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, డిఎంహెచ్‌ఓ గోపాలరావు, డి.ఎస్.పి కిషోర్ కుమార్, మంగపేట యస్‌ఐ టి.వి.ఆర్.సూరి, ఎంపీడీఓ బద్రు నాయక్, అగ్నిమాపక సిబ్బంది, ఆలయ అర్చకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






