శ్రీశైలంలో నీళ్లున్నా సాగుకు అందించలేని ప్రభుత్వం
కేఎల్ఐ పంపులు 24 గంటలు నడపాలి
వనపర్తి సెప్టెంబర్ 11(విజయక్రాంతి): శ్రీశైలం ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ పాలమూరు రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. రేవల్లి మండలం గౌరీదేవిపల్లి వద్ద మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) స్టేజ్-3 పంప్‌హౌస్‌ను మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సి.లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలంలో నీటి నిల్వలు ఉన్నా ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు.
ఏపీ ప్రభుత్వం(AP Government) పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకుపోతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేఎల్ఐ పంపులను 24 గంటలు నడిపి రైతులకు నిరంతరాయంగా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కేఎల్ఐ పంపులకు ప్రత్యేక విద్యుత్ లైన్ ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో మోటార్లు దెబ్బతింటున్నాయని తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న నీటిని యాసంగి పంటలకు కూడా వినియోగించే అవకాశం ఉందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 33 నెలలుగా పెండింగ్‌లో పెట్టారని ఆరోపిస్తూ.. ఫ్యూచర్ సిటీ, ఇతర వ్యవహారాలపై ఉన్న శ్రద్ధ రైతులకు సాగునీరు అందించడంలో లేదని విమర్శించారు.
పంటలు దెబ్బతింటే ప్రభుత్వమే బాధ్యత వహించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణకు రావాల్సిన నీరు రాకపోగా ఆంధ్రప్రదేశ్‌కు నీరు తరలిపోతోందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కేఎల్ఐ మోటార్లకు విద్యుత్ సరఫరా సక్రమంగా చేయకపోవడం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. పంటలు దెబ్బతింటే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
రైతులకు సాగునీరు అందించే వరకు అండగా ఉంటాం: మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి
రైతులకు సాగునీరు అందించడంపై ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేదని మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తేనే ప్రభుత్వం మోటార్లు ఆన్ చేస్తోందని ఆరోపించారు. రైతులకు సాగునీరు అందించే వరకు అండగా ఉంటామని, మోటార్లను నిరంతరాయంగా నడిపించాలని డిమాండ్ చేశారు.
కె ఎల్ ఐ తమకు అప్పగిస్తే తాము నడిపిస్తాం: మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి
కేఎల్ఐ పంపులను సక్రమంగా నడపడం లేదని, విద్యుత్ సరఫరా నిలిపివేయడం దారుణమన్నారు. కేఎల్ఐను తమకు అప్పగిస్తే తాము నడిపిస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. మోటార్లు ఆన్ చేయకపోతే పంప్‌హౌస్‌ల వద్ద టెంట్లు వేసుకుని ఆందోళన చేస్తామని హెచ్చరించారు.