చిలుకూరు బాలాజీ పూర్వ ప్రధానార్చకుడు సౌందరరాజన్ కన్ను మూత
అనారోగ్యంతో చిలుకూరులోని నివాసంలో మృతి
పలువురి సంతాపం
మొయినాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్(90) శుక్రవారం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం చిలుకూరులోని తన నివాసంలో మృతిచెందినట్టు ఆ యన తనయుడు, ప్రస్తుత ప్రధాన అర్చకు డు రంగరాజన్ వెల్లడించారు. ఈ వార్త తెలి సి భక్తులు, ఆధ్యాత్మిక వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దశాబ్దాలుగా ఆలయ సేవలో నిమగ్నమై, లక్షలాది భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించిన ఆయన సేవలు చిరస్మరణీయమని భక్తులు పేర్కొంటున్నా రు. ఆయన మరణ వార్త తెలిసిన వెంట నే భక్తులు ఆలయానికి చేరుకుని నివాళులు అర్పించారు.
సనాతన ధర్మ పరిరక్షణకు కృషి: కిషన్‌రెడ్డి
సౌందరరాజన్ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం సౌందరరాజన్ తుదిశ్వాస వరకు కృషి చేశారని గుర్తు చేశారు. దేవాలయాల స్వయం ప్రతిపత్తికోసం వారు చేసి ఉద్యమాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు.
దేవుడిని, దేవాల యాలను బిజినెస్ సెంటర్లుగా కాకుండా.. ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చాలనే లక్ష్యం తో.. కేవలం ‘వాక్’ పత్రిక విక్రయాల ద్వారా మందిరాన్ని నడిపి చూపించిన ఆదర్శశీలి అని కొనియాడారు. కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటంలో, అదే సమయంలో అర్చకుల హక్కుల పరిరక్షణలో ముందుండి నడిచారని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అధ్యాత్మిక చైతన్యంపై కీలకపాత్ర: సీఎం రేవంత్‌రెడ్డి
సౌందర రాజన్ మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సౌందర రాజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం కల్పించాలని కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్యాపకుడిగా, రిజిస్ట్రార్‌గా ఎంతో మంచి పేరు గడించిన సౌందర రాజన్.. అధ్యాత్మిక చైతన్యం విస్తరించడంలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు.
ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు: కేసీఆర్
సౌందర్ రాజన్ మృతి హైందవ ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు అని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సామాజిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ, తనదైన శైలిలో దైవ సేవ చేయడం ద్వారా, సౌందర్ రాజన్ ’ప్రజా పూజారి’ గా ప్రసిద్ధిగాంచారని తెలిపారు. ఆయన అనుసరించిన ఆధ్యాత్మిక విధానాలు భవిష్యత్లో అర్చక సేవను వృత్తిగా ఎంచుకునే యువతకు ఆదర్శనీయమని పేర్కొన్నారు.
సౌందరరాజన్ మరణ వార్త కలిచి వేసింది: కేటీఆర్
సౌందరరాజన్ మృతి వార్త తనను కలిచివేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చిలుకూరు క్షేత్ర అభివృద్ధిలో, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయడంలో సౌందరరాజన్ పోషించిన పాత్ర మరువలేనిదని కొనియాడారు. కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సమాజంలోని మూఢనమ్మకాలపై పోరాడటం, దళిత గోవిందం వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక సమరసతకు ఆయన కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.




