మావోయిస్టు కర్ర వెంకటరెడ్డి ఎక్కడ?
- అగ్ర నేతలు లొంగిపోయినా ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడా?
- ఆశల్లేవంటున్న తల్లిదండ్రులు
మహబూబాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్ట ణానికి చెందిన కర్ర వెంకటరెడ్డి అలియాస్ కేవీ 38 ఏళ్లుగా అజ్ఞాతవాసంలో ఉంటున్నట్లు పోలీసు వర్గాలు కొద్ది రోజుల క్రితం ధ్రువీకరించాయి. కేవీ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కమిటీ సభ్యుడిగా కీలకమైన బాధ్యతల్లో ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
అయితే ఇటీవల మావోయిస్టు కీలక నేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నరసింహారెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారితో పాటే కేవీ కూడా లొంగిపోతాడనే ప్రచారం సా గిం ది. అయితే 1988లో కనిపించకుండా పోయిన కేవీ ఆచూకీ 38 ఏళ్లు దాటుతున్న ఇప్పటివరకు లభించలేదు. కేవీ అజ్ఞాతంలో ఉన్నట్టా లేనట్టా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కేసముద్రం పట్టణ కేంద్రానికి చెందిన పంచాయతీరాజ్ రిటైర్డ్ ఉద్యోగి సోమిరెడ్డి సరోజన దంపతులకు 1968 నవంబర్ 14న జన్మించిన వెంకట్‌రెడ్డి.. ఇంటర్ చదువుతూ 1988 జనవరి 1న అదృశ్యమయ్యాడు.
అప్పటి నుంచి ఆచూకీ కోసం తల్లిదండ్రులు వెతికినా ఫలితం లేదు. కొంత కాలం తర్వాత అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి, పలుసార్లు పోలీస్ స్టేషన్లకు పిలిపించినట్లు తల్లిదండ్రులు చెప్పారు. అనేకసార్లు మావోయిస్టు పార్టీ లోనే ఉన్నట్లు పేర్కొనడం తప్ప జాడ తెలిపే ఘటనలు చోటు చేసుకోలేదని తల్లిదండ్రులు తెలిపారు.




