1 March, 2026 | 2:35 AM

కేపీహెచ్‌బీలో గజం రూ.2.65 లక్షలు !

28-02-2026 12:00 AM

ప్ల్లాట్ ధర రూ. 1.10 కోట్లు

హౌసింగ్ బోర్డు వేలంలో రికార్డు ధరలు 

హైదరాబాద్,సిటీ బ్యూరో ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో భూ ముల ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి. హౌసింగ్ బోర్డుకు చెందిన ప్లాట్లు, ప్లాట్ల కోసం కొనుగోలుదారులు భారీగా పోటీ పడ్డారు. శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధరలు పలకడంతో అందరూ విస్తుపోతున్నారు.

ఎటువంటి వివాదాలు లేని ప్రభుత్వ స్థలాలు కావడంతో పాటు, అన్ని వసతులు ఉన్న ఏరియా కావడంతో జనం వీటి ని సొంతం చేసుకోవడానికి పోటాపోటీగా పాట పాడారు. కేపీహెచ్‌బీ ఫేజ్-1, 2 లోని ధర్మారెడ్డి కాలనీలో ఉ న్న 4 ఓపెన్ ప్లాట్లకు వేలం నిర్వహించారు. వివరాలను హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ వెల్లడించారు.

ధర్మారెడ్డి కాలనీలో ఉన్న 4 ఓపెన్ ప్లాట్లకు ఈ వేలం నిర్వహించారు. ఇం దులో ఎల్‌ఐజీ కేటగిరీకి చెందిన ఒక ప్లాట్ కనీస ధరను అధికారులు గజానికి రూ. 1.30 లక్షలుగా నిర్ణయించారు. ఆ భూమిని దక్కించుకోవడానికి బిడ్డర్లు పోటీ పడటంతో ఏకంగా రూ. 2.65 లక్షల ధరకు అమ్ముడుపోయింది. మరో ప్లాట్ గజానికి రూ. 2.41 లక్షల ధర పలికింది. కేవలం ఈ నాలుగు ఓపెన్ ప్లాట్ల విక్రయం ద్వారానే హౌసింగ్ బో ర్డుకు రూ. 15.81 కోట్ల ఆదాయం వచ్చినట్లు వైస్ చైర్మన్ తెలిపారు.

ప్ల్లాట్ల కోసం పోటాపోటీ..

ప్లాట్లతో పాటు కేపీహెచ్‌బీ ఫేజ్-15లోని సంపూర్ణం అపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 8 ప్లాట్లకు కూడా కొనుగోలుదారులు విపరీతమైన ఆసక్తి చూపారు. సుమారు 1400 ఎస్‌ఎఫ్టీ విస్తీర్ణం కలిగిన ఈ ప్లాట్ల కనీస ధరను రూ.90 లక్షలుగా నిర్ణయించగా, వేలంలో గరిష్టంగా రూ. 1.10 కోట్లు పలికింది.

మిగిలిన ప్లాట్లు కూడా రూ. 1.08 కోట్లు, రూ. 1.07 కోట్లు, రూ. 1.06 కోట్లకు కొనుగోలుదారులు సొంతం చేసుకున్నారు. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా రూ. 8.45 కోట్ల ఆదాయం వచ్చిందని  తెలిపారు. మొత్తం 40 మంది కొనుగోలుదారులు పాల్గొన్న ఈ వేలం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగిందని వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ పేర్కొన్నారు.