తండా గుండెల్లో ఆరోగ్య వెలుగు.. సేవే లక్ష్యంగా మిషన్ వాక్
మిషన్ వాక్ ఫౌండేషన్‌ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
సింగరేణి,(విజయక్రాంతి): మారుమూల గ్రామాలు, గిరిజన తండాల ప్రజలకు వైద్య, ఫిజియోథెరపీ, పునరావాస సేవలను చేరువ చేస్తున్న మిషన్ వాక్ ఫౌండేషన్(Mission Walk Foundation) సేవలు అభినందనీయమని పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(Former MLA Rega Kantha Rao) అన్నారు. హైదరాబాద్‌లోని మిషన్ వాక్ ఫౌండేషన్‌ను సందర్శించిన ఆయన ఫౌండర్ డాక్టర్ బాదావత్ రవితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సేవా యాత్ర ద్వారా మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తూ వైద్య సేవలు అవసరమైన వారిని గుర్తిస్తున్నామని డాక్టర్ రవి వివరించారు.
ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం బాధితులకు ఫిజియోథెరపీ, పునరావాస సేవలతో పాటు వైద్య అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని మారుమూల తండా నుంచి వచ్చిన డాక్టర్ బాదావత్ రవి పేదలు, గ్రామీణ ప్రజల కోసం చేపడుతున్న సేవలను రేగా కాంతారావు అభినందించారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య సేవలకు దూరమయ్యే వారికి మిషన్ వాక్ సేవలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. గ్రామ సేవా యాత్రను మరింత విస్తరించి ఎక్కువ తండాలు, గ్రామాలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు.
రేగా కాంతారావుకు సన్మానం
మిషన్ వాక్‌ను సందర్శించిన రేగా కాంతారావును డాక్టర్ బాదావత్ రవి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. సేవా కార్యక్రమాలను అభినందించినందుకు రేగా కాంతారావుకు డాక్టర్ రవి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ హాజ్రా, పీకే సింగ్, షేర్ ఖాన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.