7 May, 2026 | 2:47 AM

నలుగురు రైతులు మృతి

07-05-2026 02:15 AM
  1. అర్ధరాత్రి ఈదురు గాలుల.. వర్షం బీభత్సం
  2. ధాన్యం కుప్పలపై కవర్లు కప్పేందుకు వెళ్లిన రైతులు
  3. వానధాటికి తలదాచుకునేందకు రేకుల షెడ్‌లోకి వెళ్లగా గోడలు కూలి ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం
  4. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి
  5. మృతుల్లో గంపలపల్లికి చెందిన తండ్రీకొడుకు
  6. మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట మండలం,  కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో తీవ్రవిషాదం

లక్షెట్టిపేట, మే 6 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులు, వర్షం బీభత్సానికి నలుగురు రైతులు బలయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించి, ఆరబెట్టిన ధాన్యాన్ని రక్షించుకునేందుకు వెళ్లిన అన్నదాతలపై షెడ్లగోడులు కూలి ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందాడు.

ఈ మృతుల్లో గంపలపల్లికి చెందిన తండ్రీకొడుకు ఉన్నారు. పంటను రక్షించుకుందామని వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిపోయారని కుటుంబీకుల రోదనలు విలపించారు. దీంతో కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో తీవ్ర షాదఛాయలు అలుముకున్నాయి. ధాన్యం కుప్పలపై కవర్లు కప్పేందుకు వెళ్లిన రైతులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. 

మంచిర్యాల జిల్లాలో మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో ఎక్కడ తమ పంట తడిసిపోతుందోనని, ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్లు కప్పేందుకు లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు గంపలపల్లికి చెందిన తండ్రి తనుగుల నాగరాజు, ఆయన కుమారుడు తనుగుల అభిరాంతోపాటు, గుండారపు వెంకటేష్ (24)తో మరో ఐదుగురు రైతులు వెళ్లారు.

రైతులు ధాన్యం కుప్పలపై కవర్లు కప్పే ప్రయత్నం చేస్తుండగా ఈదురుగాలులు, వర్షం తీవ్రత అధికమైంది. దీంతో వారు తలదాచుకునేందుకు సమీపంలోని రేకుల షెడ్‌లలోకి వెళ్లారు. ఇదే ప్రమాదంలో దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన నెల్కి లచ్చన్న తన కుమారుడిని హైదరాబాద్ బస్సు ఎక్కించేందుకు లక్షెట్టిపేట వెళ్లి తిరిగొస్తున్నాడు. వర్షం ఎక్కువ కావడంతో షెడ్డులో కొంతమంది ఉండటాన్ని గమనించి లచ్చన్న అందులోకి వెళ్లాడు.

ఒక్కసారిగా గోడ కూలడంతో ముగ్గురు రైతులు తనుగుల అభిరాం(22), వెంకటేష్, లచ్చన్న(55) అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న లక్షెట్టిపేట పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో, ప్రాథమిక చికిత్స చేశారు.

అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నాగరాజు(50) మృతి చెందాడు. ధాన్యాన్ని రక్షించుకుందామని వెళ్తే ప్రాణాలు పోయాయంటూ కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. ఈ ఘటనతో కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో తీవ్రవిషాదఛాయలు అలముకున్నాయి. గోడకూలి నలుగురు రైతులు మృతిచెందడం చాలా విషాదకరమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు అన్నారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నా తరుఫున రెండు లక్షల తక్షణ సాయం అందిస్తానని, క్షతగాత్రులకు ప్రభుత్వం తరుఫున మెరుగైన వైద్యం అందిస్తామని, ప్రభుత్వం తరుఫున బాధిత రైతుల కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.