వేడుకగా ఆర్జేసీ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే
ఖమ్మం ఎడ్యుకేషన్,(విజయక్రాంతి): ఆర్జేసీ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు(Freshers Day Celebrations) శనివారం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రణాళికాబద్ధంగా కష్టపడితే విజయాన్ని సాధించవచ్చన్నారు. 28 ఏళ్లుగా ఆర్జేసీ డిగ్రీ కళాశాల(RJC Degree College) విద్యా రంగంలో అనేక విజయాలు సాధించిందని తెలిపారు. కళాశాల విద్యార్థులు శాస్త్ర, విద్య, కళలు, క్రీడలు, వ్యాపారం, రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో స్థిరపడినట్లు పేర్కొన్నారు.
అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చైర్మన్ గుండాల కృష్ణను విద్యార్థులు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. చివరగా విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ, పాశ్చాత్య, బ్రేక్, గ్రూప్, సోలో నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏ. లింగయ్య, ఇన్‌చార్జిలు ఆంజనేయులు, సునంద తదితరులు పాల్గొన్నారు.