15 June, 2026 | 2:37 AM

ప్రగతినగర్ స్వామి వివేకానంద పార్కు అభివృద్ధికి నిధులు కేటాయించాలి

15-06-2026 01:23 AM

సామాజిక కార్యకర్త ఆకుల సతీష్

కుత్బుల్లాపూర్, జూన్ 14 (విజయక్రాంతి): ప్రగతి నగర్ స్వామి వివేకానంద పార్కు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్లో సర్వే నంబర్లు 178, 179లో దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్వామి వివేకానంద పార్కును తక్షణమే అభివృద్ధి చేసి ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ స్థానికులతో కలిసి స్వచ్ఛ భారత్ చేస్తూ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ పార్కుకు కాంపౌండ్ వాల్ నిర్మించి ఎన్నో సంవత్సరాలు గడిచినా, ఇప్పటి వరకు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. పార్కులో ఉన్న రెండు అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని, అలాగే గ్రామపంచాయతీ నిధులతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ పనులు 90 శాతం పూర్తయినా మిగిలిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు ఎకరాల ఈ పార్కులో సహజసిద్ధమైన కొండలు, పెద్ద పెద్ద వృక్షాలు ఉండటం వల్ల ఇది ప్రగతి నగర్ ప్రజలకు అత్యంత విలువైన పర్యావరణ సంపదగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోకపోతే స్థానిక ప్రజలతో కలిసి భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, చందు, పి.వి. శ్రీనివాస్, ఎల్ల స్వామి, మురళీకృష్ణ, కృష్ణ , కిషోర్, వెంకట రావు, రాజిరెడ్డి, రమణ, రాము తదితరులు పాల్గొన్నారు.