3 September, 2026 | 4:31 PM

ఐకేపీ కేంద్రం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

03-09-2026 | 03:26pm

కలెక్టర్‌కు గణపురం ఆయకట్టు రైతుల ఫిర్యాదు

గణపురం, సెప్టెంబర్ 03 (విజయక్రాంతి): గత యాసంగి సీజన్‌లో(Yasangi season) ధాన్యం కొనుగోళ్లలో తమకు రావాల్సిన డబ్బులు తక్కువగా చెల్లించారని ఆరోపిస్తూ ఐకేపీ చైతన్య మహిళా సంఘం(IKP Chaitanya Women's Group) కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గణపురం ఆయకట్టు రైతులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. గణపురం మండల కేంద్రంలోని కొత్తపల్లి ప్రాంతంలో నిర్వహించిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో(IKP Paddy Procurement Centre) గణప సముద్రం ఆయకట్టు రైతులు ధాన్యం విక్రయించినట్లు తెలిపారు. ట్రక్‌ సీటులో నమోదైన పరిమాణానికి, తమ ఖాతాల్లో జమ చేసిన మొత్తానికి వ్యత్యాసం ఉందని, ఒక్కో రైతుకు సుమారు నాలుగు నుంచి ఐదు బస్తాల ధాన్యానికి సంబంధించిన డబ్బులు తక్కువగా వచ్చాయని ఆరోపించారు.

ఈ విషయంపై పలుమార్లు గణపురం సర్పంచ్‌ కట్కూరి రాధిక శ్రీనివాస్ ల కు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులకు సరైన సమాధానం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు, తమకు రావాల్సిన మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు బోట్లపాటి నాగేశ్వరరావు, మార్క మొగిలి, నరిగమల్లక్క, నారగాని సురేష్, ముక్కెర నరేందర్, బండి కుమారస్వామి, గడ్డమీది రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.