పంట నష్టపరిహారం ఇవ్వకుంటే న్యాయ పోరాటం
జడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసిన్ రెడ్డి...
ఆదిలాబాద్, సెప్టెంబర్ 03, (విజయక్రాంతి) : గత ఏడాది భారీ వర్షాలతో(Heavy rains) పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మొత్తం నష్ట పరిహారాన్ని ఫ్రీజింగ్ ఎత్తివేసి రైతులకు అందించాలని జడ్పీ మాజీ చైర్పర్సన్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి(Chityala Suhasini Reddy) డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... గత సంవత్సరం ఆగస్టులో సంభవించిన వర్షాల కారణంగా సుమారు 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగుండన్నారు. ఆ సందర్భంలో అప్పటి ఇన్చార్జి మంత్రి ముంపు ప్రాంతాలను పరిశీలించి, పది రోజుల్లోగా నష్టపోయిన రైతులకు 10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ అది ఇంతవరకు అమలకు నోచుకోలేదని ఆమె ఆక్షేపించారు.
పంట నష్ట పరిహారంకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ దానిని ఫ్రీజింగ్ చేసి రైతులకు ఇంతవరకు అందజేయక పోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిహారం వెంటనే రైతులకు చెల్లించాలని, లేని పక్షంలో హైకోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. రైతుల పంట నష్టం పై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే లు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని సూచించారు. అదేవిధంగా ఫసల్ భీమా యోజన పథకాన్ని(Fasal Bima Yojana scheme) వెంటనే అమలు చేయాలని, పెన్ గంగా ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అల్లూరి నారాయణరెడ్డి, సలేంద్ర శివయ్య, రైతులు లక్ష్మారెడ్డి, సతీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






