గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగాయి: సీపీ సజ్జనార్
హైదరాబాద్, సెప్టెంబర్, 26( విజయక్రాంతి): హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జ(Ganesh Immersion)న కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయని సీపీ సజ్జనార్(CP Sajjanar) తెలిపారు. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో నిమజ్జన కార్యక్రమాలు కొనసాగాయని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. నిమజ్జనానికి ముందు రివ్యూ సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించామని సజ్జనార్ తెలిపారు. నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ విగ్రహాల నిమజ్జనాలను నిర్ణీత సమయానికి పూర్తి చేయించామని సీపీ పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని చూసేందుకు సుమారు 30 లక్షల మంది, బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి సుమారు 15 లక్షల మంది హాజరైనట్లు సజ్జనార్ తెలిపారు.భారీ సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగాయని సీపీ సజ్జనార్ వెల్లడించారు.