4 May, 2026 | 2:11 AM

నకిలీ డాక్యుమెంట్ల ద్వారా భూ కబ్జాకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

04-05-2026 12:49 AM

నిందితులకు సహకరించిన సబ్ రిజిస్ట్రార్ రెహమాన్ 

మేడ్చల్, మే 3 (విజయ క్రాంతి): నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం నిజాంపేట్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి దుప్పలపూడి రవీంద్ర కీసర మండలం రాంపల్లి గ్రామంలోని 404,405 సర్వే నంబర్లలో 1983లో 300 గజాలు కొనుగోలు చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో ఇతరుల అయ్యాయని గుర్తించి కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా మోసం బయటపడింది.

నిందితులు ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించి అసలు యజమాని లేరని భావించి నకిలీ లింక్ డాక్యుమెంటు నంబర్ సృష్టించి భూ కబ్జాలు చేశారు. డాక్యుమెంట్ రైటర్ ఉదయ రెడ్డి, సబ్ రిజిస్టర్ రహమాన్ తో కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి పలుమార్లు విక్రయించినట్లు తేలింది. ప్లాట్ కు నకిలీ యజమానిగా గా ధర్మారావును సృష్టించి అతను ప్రదీప్ కుమార్ కి, ప్రదీప్ కుమార్ ఆ ప్లాటును రెండుగా విభజించి ప్రభాకర్, నరేష్ కు విక్రయించారు. వీరు జివిఆర్ ఇన్ఫా స్ట్రక్చర్ యజమాని గుబ్బల వెంకటేశ్వరరావుకు రిజిస్ట్రేషన్ చేశారు.

ఆ తర్వాత ఇవి జంగాల శ్రీరామ్, విజయలక్ష్మి దంపతుల పేర్లపై రిజిస్ట్రేషన్ అయింది. నిందితులు అందరూ ఒక ముఠాగా ఏర్పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా ప్లాట్లను కబ్జా చేసి అమాయకులకు విక్రయించి మోసం చేస్తున్నామని అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో జంగాల శ్రీరామ్, గుబ్బల వెంకటేశ్వరరావు ఆలియాస్ జీవీర్, బందెల ప్రశాంత్ అలియాస్ బాబి, బందెల్ల ప్రభాకర్, పొన్నబోయిన బాలకృష్ణ అలియాస్ బాలు, డాక్యుమెంట్ రైటర్ ఉదయ్ రెడ్డి ని  అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపిన జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర ఇన్స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులు, దర్యాప్తు అధికారి ఎస్త్స్ర అనిల్ కుమార్, ఇతర సిబ్బందిని డిసిపి, సిహెచ్ శ్రీధర్ అభినందించారు.