24 June, 2026 | 5:05 PM

ప్రజా రవాణాకు పెద్దపీట

24-06-2026 03:51 PM

గోదావరిఖని–కాకినాడ కొత్త బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని, జూన్ 24(విజయక్రాంతి): ప్రజల రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపర్చే దిశగా, రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గోదావరిఖని నుండి కాకినాడకు నూతన ఆర్టీసీ బస్సు సేవలను ఆయన బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బస్సుకు పూజలు నిర్వహించి, జెండా ఊపి బస్సును బయలుదేరదీశారు.

ప్రజల అవసరాలే ప్రాధాన్యత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, గోదావరిఖని మరియు పరిసర ప్రాంతాల ప్రజలు కాకినాడకు ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారని, వారి అసౌకర్యాన్ని గుర్తించి ఈ కొత్త బస్సు సేవను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. తన నియోజకవర్గ ప్రజల రవాణా అవసరాలను తీర్చడం తన బాధ్యతని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో కూడా ప్రజల సౌకర్యార్థం మరిన్ని రవాణా సౌకర్యాలను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్  చొరవపై స్థానిక ప్రజలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.