21 June, 2026 | 1:54 AM

బిడ్డా కాస్కో.. మీకు సినిమా చూపిస్తా

21-06-2026 12:34 AM
  1. సిరిసిల్ల ఉద్యమాకారుడి నోట్లో మట్టికొట్టావ్
  2. మాజీ మంత్రి కేటీఆర్‌పై మైనంపల్లి హాట్ కామెంట్స్

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇష్టారాజ్యంగా మాట్లాడితే కుదరదని, ‘బిడ్డా కాస్కో.. మీకు ముందు ముందు ఇంకా చాలా సినిమా చూపిస్తాం’ అని మాజీ ఎమ్మెల్యే, మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. కేటీఆర్ విపక్షంలోనూ అట్టర్ ప్లాప్ అయ్యారని, కేటీర్ ప్రతిదానికీ ఎందుకు అంతలా ఉలిక్కిపడుతున్నావ్ అంటూ ప్రశ్నించారు.

శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను అడ్డుకోవమే కేటీఆర్, హరీశ్‌రావు పనిగా పెట్టుకున్నారని, ధాన్యం సేకరణ విషయంలో ఈ ఇద్దరూ లారీలను అడ్డుకున్నారని ఆరోపించారు. అమెరికా నుంచి నేరుగా వచ్చి పదవులు అనుభవిస్తున్న కేటీఆర్, సిరిసిల్ల ఉద్యమాకారుడి నోట్లో మట్టికొట్టారని విమర్శించారు. ‘కేటీఆర్ దండుపాళ్యం బ్యాచ్ అని మాట్లాడుతున్నాడు.

దండుపాళ్యం బ్యాచ్, స్టూవర్టుపురం దొగలకైనా మినిమం ఎథిక్స్ ఉంటాయి. కానీ మీలాగా వాళ్లు సొంత చెల్లి, బావ, రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయించరు’ అని అన్నారు. కేటీఆర్ సెలబ్రెటీల ఫోన్లు ట్యాప్ చేసి, వారి జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. తాము రౌడీయిజం చేసేటోళ్లం కాదని, రౌడీలకు బుద్ధి చెబుతూ హీరోయిజం చేసేటోళ్లమన్నారు. మైనంపల్లి మాటల మనిషి కాదని చేతల మనిషి అని కీలక వ్యాఖ్యలు చేశారు.