13 May, 2026 | 1:36 AM

నీటి సంపులో పడి 13 ఏళ్ల బాలిక మృతి

13-05-2026 12:24 AM

 అనుమానాలున్నాయన్న తల్లిదండ్రులు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

శేరిలింగంపల్లి, మే 12(విజయక్రాంతి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లోని శ్రీరెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న చరణ్ కుమార్తె సారా (13) నీటిసంపులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదం స్థానికంగా కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్దిరాల తండాకు చెందిన చరణ్- దంపతులు జీవనోపాధి కోసం గత 10 ఏళ్లుగా మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు.

8 రోజుల క్రితమే చరణ్ శ్రీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేపట్టాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఈ విషాదం జరిగింది. నీటిసంపుమూత తెరిచి ఉండటం గమనించని సారా ప్రమాదవశాత్తు అందులో పడిపోయినట్లు తెలుస్తోంది. చాలాసేపటి నుంచి కూతురు కనిపించక పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అపార్ట్‌మెంట్‌లోని అన్ని ప్రాంతాల్లో గాలించారు.

అనుమానం వచ్చి నీటి సంపులో చూసేసరికి సారా విగతజీవిగా కనిపించింది. వెంటనే బాలికను బయటకు తీసి నిజాంపేట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కూతురు మృతితో చరణ్, రేణుక దంపతులు కన్నీరు మున్నీరయ్యారు.