జనగామలో ఘనంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు
జనగామ, ఆగస్టు15(విజయక్రాంతి): జనగామ జిల్లా సమీకృత కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలేరు శాసనసభ్యుడు బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ... ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికీ చేరాలని, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంతో అన్ని పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇళ్లకు ఉచిత విద్యుత్తు, రైతులకు ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఆరోగ్య సేవలు బాగా అమలవుతున్నాయి. పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు వచ్చాయని, పారిశుద్ధ్యంలో జిల్లా ముందుందని పేర్కొన్నారు.విద్యార్థుల దేశభక్తి నృత్యాలు, వివిధ శాఖల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంచి సేవలు అందించిన ఉద్యోగులకు,క్రీడాకారులకు,ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందించారు. దివ్యాంగులకు వాహనాలు, మహిళలకు కుట్టు యంత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, బెన్షాలోమ్, డిసిపి రాజ మహేంద్ర నాయక్, కడకంచి బాలమణి. తదితరులు పాల్గొన్నారు.






