అమీన్‌పూర్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్‌తో కలిసి జెండా ఆవిష్కరించిన మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్
అమీన్‌పూర్, ఆగస్టు 15: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా మరియు దేశభక్తి భావనలతో నిండిన వాతావరణంలో జరిగాయి. ఇందులో భాగంగా అమీన్‌పూర్ జీహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించిన అధికారిక వేడుకల్లో డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్‌తో కలిసి అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీరంగూడ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఏర్పాటుచేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. వివిధ కాలనీల్లో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి, వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. దేశం కోసం ఎంతోమంది మహానుభావులు చేసిన త్యాగాల ఫలితమే నేడు మనం ఈ స్వాతంత్ర్య వేడుకలను ఇంత ఘనంగా జరుపుకోగలుగుతున్నామని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయ సాధనకు యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. దేశభక్తిని పెంపొందించుకుంటూ సమాజ అభివృద్ధికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు, జిహెచ్ఎంసి సిబ్బంది మరియు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






