15 April, 2026 | 12:27 AM

స్వర్ణకారులు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి

14-04-2026 08:35 PM

సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): స్వర్ణకారులు తమ షాపుల్లో విధిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ సూచించారు. పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో మంగళవారం జిల్లా స్వర్ణకారుల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రికవరీ కేసులపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై చంద్రకుమార్ మాట్లాడుతూ స్వర్ణకారులు బంగారు ఆభరణాల తయారీ, ఇతరత్రా లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఇందుకోసం రిజిస్టర్లు మైంటైన్ చేయాలని సూచించారు.

వివాదాస్పద వ్యక్తులు వచ్చిన సందర్భాల్లో గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. లావాదేవీలకు వచ్చేవారి ఆధార్ కార్డులను కూడా పరిశీలించాలన్నారు. అవసరమైతే జిరాక్స్ కాపీలను స్వీకరించాలని చెప్పారు. అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు జరుపవద్దని స్పష్టం చేశారు. వారి కుటుంబ నేపథ్యాన్ని కూడా గమనించాలన్నారు. పెద్ద మొత్తంలో బంగారం తీసుకోవచ్చు వారిని ప్రధానంగా గమనించాలని ఎస్సై తెలిపారు. గతంలో పోలిస్తే రికవరీ కేసులు తగ్గాయని ఆయన అన్నారు.   రికవరీల విషయంలో అకారణంగా పోలీసులు వేధింపులు జరపరని స్పష్టం చేశారు. స్వర్ణకారులు ఎప్పటికప్పుడు తమకు అందుబాటులో ఉండాలన్నారు.