బీఆర్‌ఎస్ పార్టీకి రాపోలు గుడ్‌బై

05-05-2024 02:13:11 AM

* ప్రజా ఉద్యమాల్లో ఉంటానని ప్రకటన

హైదరాబాద్, మే 4 (హైదరాబాద్) : రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మశాలీ సంఘం నాయకుడు రాపోలు ఆనంద భాస్కర్ బీఆర్‌ఎస్ పార్టీని వీడారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌కు పంపించారు. తనను పార్టీలో చేర్చుకుని ఆదరించినందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ తన రాజీనామా లేఖను పోస్ట్ చేయడంతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. సేనలు, శ్రేణులు బీఆర్‌ఎస్ పార్టీకి నిండుగా ఉన్నాయని పార్టీకి తన అవసరం లేదని, అందుకే గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తనను పార్టీలోకి ఆహ్వానిస్తూ కప్పిన గులాబీ కండువాను సైతం తిరిగి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు పోస్టు ద్వారా పంపిస్తున్నట్లు వెల్లడించారు.

ఇక ముందు బలహీన వర్గాల ఆకాంక్షల సాధన కోసం, సామాజిక న్యాయ ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషిస్తాని రాపోలు స్పష్టం చేశారు. చేనేత సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం నా నిరంతరం పోరాటం కొనసాగుతుందన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ అందరి దృష్టికి తీసుకుపోతామన్నారు. కాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో కుల జన గణన కోసం కార్యాచరణ చేపట్టడాన్ని ప్రశంసించారు. రాపోలుతో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత ఎండీ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ నేత, గౌడ సంఘం రాష్ట్ర నేత లక్ష్మణ్ గౌడ్ బీఆర్‌ఎస్ రాజీనామా చేశారు.