రోహిత్ వేముల కేసు పునర్విచారణ

05-05-2024 02:14:45 AM

సమగ్ర విచారణ చేయాలని డీజీపీకి సీఎం ఆదేశం

న్యాయం కోసం రేవంత్‌ను కలిసిన రోహిత్ తల్లి  

న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి హామీ

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల కేసును పునర్విచారణ (రీఓపెన్) చేయనున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని రోహిత్ వేముల తల్లి రాధిక శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తన కుమారుడు ఎస్సీ కాదని, అతని ఆత్మహత్య కేసును మూసివేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తంచేశారు. కావాలనే ఈ కేసు విచారణను తప్పుదోవ పట్టించారని అనుమానాలను వ్యక్తం చేశారు. రోహిత్ వేముల కులంపైనా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని, రోహిత్ దళితుడే అని స్పష్టంచేశారు. ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

గతంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించి, రోహిత్ వేముల కుటుంబానికి అండగా ఉంటానని మాటిచ్చారు. రాధిక విజ్ఞప్తి మేరకు కేసు విచారణలో న్యాయం జరిగేలా చూస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. 2016 జనవరి 17న హాస్టల్ గదిలో రోహిత్ వేముల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కులవివక్ష వ్యతిరేక ఆందోళనలు చెలరేగాయి. దీనిపై అనేక రాజకీయ పార్టీల నేతలు స్పందించారు. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి వెళ్లారు.

ఈ ఘటనపై గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 2023 నవంబర్‌లో రిపోర్ట్ రూపొందించారు. ఈ ఏడాది మార్చి 21న దర్యాప్తు అధికారి ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. రోహిత్ వేముల కుటుంబ సభ్యుల కులం సర్టిఫికెట్లు అన్నీ నకిలీవని, ఎటువంటి సాక్ష్యాధారాలు లేనందున కేసును మూసివేస్తున్నామని పేర్కొన్నారు. కేసును మూసివేయడంతో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో కేసును రీఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.