చిన్నబోయింది
ఆర్‌సీబీ బౌలర్లను చితక్కొట్టిన హైదరాబాద్ బ్యాటర్లు 39 బంతుల్లోనే హెడ్ శతకం
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు
పోరాడి ఓడిన బెంగళూరు
బెంగళూరు:
ఐపీఎల్ 2024 సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మరోసారి మెరిసింది. సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్ 25 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. రికార్డు స్థాయిలో సిక్సర్లు నమోదైన పోరులో గెలిచిన రైజర్స్.. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. చిన్నస్వామి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించిన పిచ్‌పై తొలుత హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించి నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేశారు.
ట్రావిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు కూడా కడవరకు పోరాడింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులకు పరిమితమైంది. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. మధ్యలో దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) పోరాడాడు. రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, మార్కండే రెండు వికెట్లు పడగొట్టారు. చిన్నస్వామిలో సిక్సర్ల సునామీ సృష్టించిన హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ట్రెవిస్ హెడ్ విధ్వంసం..
టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకోవడంతోనే బెంగళూరు మొదటి తప్పు చేసింది. హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రెవిస్ హెడ్, అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) శుభారంభం ఇచ్చారు. ఆరంభం నుంచే ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడిన ఇద్దరు సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించారు. వీరి ధాటికి పవర్ ప్లే (తొలి ఆరు ఓవర్లు) ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 76 పరుగులు దాటింది. ట్రెవిస్ హెడ్ కేవలం 17 బంతుల్లోనే అర్థశతకం మార్క్ చేరుకున్నాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్ 8వ ఓవర్లో వంద పరుగుల మార్క్‌ను అందుకుంది. ఈ దశలో అభిషేక్ శర్మ టోప్లీ బౌలింగ్ లో ఫెర్గూసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో ఎస్‌ఆర్‌హెచ్ 108 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన క్లాసెన్ .. ట్రేవిస్ హెడ్‌కు జతయ్యాడు.
అగ్నికి వాయువు తోడైనట్లుగా హెడ్, క్లాసెన్‌లు ఆర్‌సీబీ బౌలర్లను నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. విజయ్ కుమార్ వైశాక్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో హెడ్ మూడు ఫోర్లు బాది 39 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకొని ఐపీఎల్లో నాలుగో వేగవంతమైన సెంచరీని సాధించాడు. అయితే సెంచరీ సాధించిన మరుక్షణమే ఫెర్గూసన్ బౌలింగ్ లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్లాసెన్ షో మొదలైంది. 23 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న క్లాసెన్ ఫెర్గూసన్ బౌలింగ్‌లో విజయ్‌కుమార్ వైశాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో రెండు ఓవర్ల పాటు హైదరాబాద్ స్కోరు నెమ్మదించినప్పటికి.. ఆఖర్లో మార్క్రమ్ (17 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అబ్దుల్ సమద్(10 బంత్లులో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారున. బెంగళూరు బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు తీశాడు.
కార్తిక్ మెరుపులు..
ఈ దశలో ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న దినేశ్ కార్తిక్ మరోసారి తన హిట్టింగ్ పవర్‌ను రుచి చూపించాడు. హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడిన దినేశ్ కార్తిక్ ఆఖరికి నటరాజన్ బౌలింగ్‌లో కీపర్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కార్తిక్ ఔటయ్యే సమయానికి బెంగళూరు స్కోరు 18.5 ఓవర్లలో 244 పరుగులుగా ఉంది. అప్పటికే చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 262 పరుగులు చేయగలిగింది. అనూజ్ రావత్ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఐపీఎల్లో టాప్
287/3 హైదరాబాద్ బెంగళూరు
277/3 హైదరాబాద్ ముంబై
272/7 కోల్‌కతా ఢిల్లీ
263/5 బెంగళూరు పుణే
257/5 లక్నో పంజాబ్






