తీరు మారదా?

16-04-2024 06:26:14 PM

 హైదరాబాద్ క్రికెట్ సంఘంలో సందిగ్ధత

మ్యాచ్‌కు ముందు విద్యుత్ అంతరాయం

అసోసియేషన్‌లో కొనసాగుతున్న వర్గపోరు 

తరలిపోతున్న ప్రతిభావంతులు

దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి సైతం మెరికెల్లాంటి ఆటగాళ్లు వెలుగులోకి వస్తుంటే.. ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ మాత్రం ప్రతిభావంతులను వెలికి తీయడంలో వెనుకబడి పోతున్నది. భారత తొలి కెప్టెన్‌గా వ్యవహరించిన సీకే నాయుడు నుంచి మొదలు కొని.. వన్డే ప్రపంచకప్‌లో మూడు సార్లు టీమిండియాకు సారథ్యం వహించిన మహమ్మద్ అజహరుద్దీన్ వరకు భాగ్యనగరంలో క్రికెట్ ఓనమాలు నేర్చినవారే!

మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్ష్మణ్, ప్రజ్ఞాన్ ఓఝా, నోయల్ డేవిడ్, ఎంఎల్ జయసింహ, అబ్బాస్ అలీ, ఆబిద్ అలీ, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ ఇలా చెప్పుకుంటూపోతే ఈ జాబితా చాంతాడంత అవడం ఖాయం. గతంలో క్లాసిక్ ఇన్నింగ్స్‌లకు.. కళాత్మక ఆటతీరుకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న హైదరాబాద్.. ఇప్పుడు ఆ స్థాయి ఆటగాళ్లను తీర్చిదిద్దలేకపోతోందా అంటే కచ్చితంగా కాదనే సమాధానమే వస్తుంది! 

మరి లోపం ఎక్కడ ఉంది? ఒకప్పుడు హైదరాబాద్ ఆటగాడు అని తెలిస్తేనే.. ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోయే స్థాయి నుంచి.. ఇప్పుడు అసలు ప్రాతినిధ్యమే లేని స్థితికి చేరిందంటే అది కచ్చితంగా పాలకుల లోపమే! ఆఖరికి ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు ఉప్పల్ మైదానానికి విద్యుత్ సరఫరా నిలిపి వేసే పరిస్థితి దాపరించింది అంటే.. సమస్య తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. హెచ్‌సీఏ స్థితి గతులపై 

ఓ కన్నేస్తే.. 

విజయక్రాంతి, ఖేల్ ప్రతినిధి: ప్రతిభావం తులకు కొదవలేకున్నా.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో పేరుకుపోయిన అవినీతి, బంధుప్రీతి వల్ల ట్యాలెంట్ మసకబారుతున్నది. దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో మన జట్టు ప్రదర్శన చూసిన వారెవరైనా ఈ మాట ఒప్పుకోక తప్పని పరిస్థితి. గతంలో రెండు సార్లు రంజీ ట్రోఫీ చేజిక్కించుకోవడంతో పాటు.. మరో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ జట్టు.. ప్రస్తుతం ‘ప్లేట్’ గ్రూప్‌లో ఈశాన్య రాష్ట్రాలతో పోటపడుతోందంటేనే మనవాళ్లు ఆటతీరు ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు! ప్రస్తుత జట్టులోనూ తిలక్ వర్మ, తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, రాహుల్ సింగ్, సీవీ మిలింద్ వంటి ప్రతిభావంతులు ఉన్నా వారికి సరైన ప్రోత్సాహం లేక వెలుగులోకి రాలేకపోతున్నారు.

మిగతా అన్ని జట్లు రంజీ ట్రోఫీ కోసం 15 మందితో టీమ్‌లను ప్రకటిస్తే.. హైదరాబాద్ మాత్రం ఏకంగా 25 మందిని ఎంపిక చేస్తున్నది. ఈ ప్రక్రియ లోపభుయిష్టం కాగా.. క్లబ్‌ల ఆధిపత్యం మధ్య హెచ్‌సీఏలో ఎప్పటి నుంచో వర్గపోరు కొనసాగుతున్నది. సుదీర్ఘ కాలం జాతీయ జట్టుకు సార థ్యం వహించిన అజహరుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైనా పరిస్థితిలో ఏమాత్రం మార్పు తీసుకురాలేకపోయాడు. ఒకవైపు అసోసియేషన్‌లో ఆధిపత్య పోరు.. మరోవైపు అవినీతి ఆరోపణలతో హెచ్‌సీఏ ప్రభ మసకబారింది. 

అజ్జుభాయ్ చేతులెత్తేశాడు!

‘ఇన్నాళ్లకు హెచ్‌సీఏ ఓ క్రికెటర్ చేతిలోకి వెళ్లింది.. ఇక పాలన గాడినపడ్డట్లే. ప్రతిభావంతుకు అవకాశాలు దక్కడం ఖాయం’ అజహరుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలినాళ్లలో క్రీడాభిమానుల్లో బాగా వినిపించిన వ్యాఖ్య ఇది. అదే సమయంలో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండటంతో.. ఇక హైదరాబాద్ క్రికెట్‌కు మంచి రోజులు వచ్చినట్లే అని అంతా భావించారు కానీ.. అది మున్నాళ్ల ముచ్చటే అయింది. అసోసియేషన్‌లో ఏళ్లుగా పాతుకుపోయిన పాతకాపులు అజహర్‌కు ఊపిరి ఆడనివవ్వలేదు. దేశవాళీ టోర్నీల కోసం అజహర్ ఒక జట్టును ఎంపిక చేస్తే.. అదే సమయంలో కార్యదర్శి పేరుతో మరో జట్టును టోర్నీకి పంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోర్టు నియమించిన పర్యవేక్షకులు, అడ్‌హాక్ కమిటీ ఇలా పలు మలుపులు తిరిగిన అనంతరం హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడిగా జగన్‌మోహన్ రావు ప్రమాణ స్వీకారం చేశారు.

కొత్త ఆశలు చిగురించేనా!

జగన్‌మోహన్‌రావు నేతృత్వంలో హైదరాబాద్ ఆతిథ్యమిచ్చిన తొలి టెస్టు ఏర్పట్లు చూస్తే.. పరిస్థితిలో మార్పు వచ్చినట్లే కనిపించింది. పకడ్బందీ ఏర్పట్లతో పాటు పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక పాస్‌లు ఇవ్వడం.. దేశసేవలో నిమగ్నమైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉచిత ప్రవేశం కల్పించడం వంటి చర్యలతో జనగ్‌మోహన్‌రావు ప్రత్యేకత చాటుకున్నారు. అదే సమయంలో జాతీయ జట్టు తరఫున మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ వంటి వాళ్లు సత్తా చాటుతుండటంతో ఇక అంతా గాడినపడ్డట్లే అనిపించింది.అయితే ఇదంతా ఉత్తి డొల్లే అని ఐపీఎల్ ఆరంభానికి కొద్ది రోజుల ముందే తేలిపోయింది.

చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ముందు విద్యుత్ అధికారులు ఉప్పల్ మైదానానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో.. ఈ అంశంతో మరోసారి చర్చకు వచ్చింది. ఐపీఎల్ ఫ్రీ పాస్‌ల విషయంలో నెలకొన్న వివాదం వల్లే కరెంట్ కట్ చేసినట్లు తేలడంతో ఇక హెచ్‌సీఏలో మార్పు రాదని క్రీడాభిమానులు పెదవి విరుస్తున్నారు.